కరోనాతో మరో ముప్పు

9 Jul, 2020 19:21 IST|Sakshi

కరోనాతో  మెదడు, నాడీ సంబంధిత సమస్యలు

మెదడు వాపు వచ్చే అవకాశం

లండన్‌ : కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ప్రపంచ దేశాలు అష్టకష్టాలు పడుతున్నసమయంలో మరో సంచలన విషయం వెలుగు చూసింది. కోవిడ్‌-19 రోగుల్లో పలు రకా మెదడు, నాడీ సంబంధిత సమస్యలను గుర్తించామని లండన్‌ పరిశోధకులు తాజాగా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యలను గుర్తించినట్టు పరిశోధకులు  తెలిపారు.

లివర్‌పూల్ విశ్వవిద్యాలయం సహా, ఇతర శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కరోనా రోగుల్లో స్ట్రోక్స్, మతిమరుపు ఇతర నాడీ సంబంధిత,మానసిక సమస్యలను కరోనాకు భారీగా ప్రభావితమైన దేశాలు నివేదించాయి. ది లాన్సెట్ న్యూరాలజీలో ప్రచురించిన ఈ అధ్యయనాల ప్రకారం గందరగోళం, స్ట్రోక్, మెదడు వాపు, వెన్నుపాము, నరాల వ్యాధి వంటి ఇతర సమస్యలు కూడా సంభవించవచ్చని పరిశోధకులు వెల్లడించారు. దాదాపు వెయ్యి మంది రోగులు ఇలాంటి సమస్యలకు గురైనారన్నారు. ఇవి అరుదుగా కనిపించే సమస్య లైనప్పటికీ, బాధితుల సంఖ్య చాలా ఎక్కువుగా ఉంటుందని లివర్‌పూల్ విశ్వవిద్యాలయం అధ్యయనవేత్త సుజన్నా లాంత్ అన్నారు. 

ప్రధానంగా బాధితుల్లో వినాశకర, తీవ్ర పరిణామాలకు దారితీసేఎన్‌సెఫలిటిస్ (మెదడులో ఇన్ఫెక్షన్‌ లేదా వాపు) ముప్పు ఒకటనీ ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు గుర్తించడం చాలా ముఖ్యమని మరో శాస్త్రవేత్త అవా ఈస్టన్ చెప్పారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇటువంటి సమస్యలుండగా, దీనిపై సమగ్ర వివరాలు తమకు అందలేదని పేర్కొన్నారు.  ఈ అంశంపై పూర్తి అవగాహన రావాలంటే  ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన  డేటాను  సమీక్షించాల్సి ఉందన్నారు.

మరోవైపు ఇటీవల ‘బ్రెయిన్‌’ పత్రికలో ప్రచురించిన పరిశోధన ప్రకారం అత్యంత అరుదైన, మెదడులో మంట పుట్టించే ఏడీఈఎం అనే ఇన్ఫెక్షన్‌ కరోనా వచ్చిన వారిలో పెరుగుతోంది. కరోనా విస్తరిస్తున్న క్రమంలో ఈ తరహా బాధితుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా మెదడులో మంటతో పాటు, డెలిరియం, బ్రెయన్‌ స్ట్రోక్‌ వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశముందని  పరిశోధనలో తేలినట్టు నివేదించింది.
 

>
మరిన్ని వార్తలు