కరోనా: నెమ్మదిగా కోలుకుంటున్న ఇటలీ!

31 Mar, 2020 11:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రోమ్‌: దాదాపు 6 కోట్ల జనాభా... అందులో ప్రాణాంతక కరోనా వైరస్‌ ధాటికి ఇప్పటి వరకు 11,591 మంది ప్రాణాలు కోల్పోయారు... లక్ష మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు... అంటువ్యాధి సోకి మరణించిన వారికి అంత్యక్రియలు సైతం నిర్వహించలేని దుస్థితి.. అప్రమత్తంగా లేకపోవడం వల్లే ఇంతటి ఘోర విషాదం సంభవించిందనే విమర్శలు.. అన్నీ వెరసి యూరప్‌ దేశం ఇటలీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రపంచ దేశాలు సహాయం చేయడానికి ముందుకు వచ్చినా మొన్నటిదాకా అక్కడ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. అయితే ప్రస్తుతం ఇటలీ కరోనా ప్రమాదం నుంచి నెమ్మదిగా కోలుకుంటోందని ఆ దేశ వైద్యాధికారులు వెల్లడించారు. గడిచిన రెండు రోజులుగా కరోనా మరణాలు, పాజిటివ్‌ కేసుల శాతంలో తగ్గుదల నమోదైనట్లు వెల్లడించారు. (10 లక్షల మందికి టెస్టులు.. ఇటలీకి భారీ సాయం! )

ఇటలీలోని లాంబార్డీ ప్రాంతంలో ఆదివారం 25,392గా ఉన్న కరోనా బాధితుల సంఖ్య సోమవారం నాటికి 25,006కు తగ్గడం మంచి పరిణామం అన్నారు. గడిచిన 24 గంటల్లో మిలాన్‌ సహా ఇతర ప్రాంతాల్లో దాదాపు 1590 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ అమలు చేయడం సత్పలితాలను ఇస్తోందని.. కాబట్టి మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టేందుకు నిబంధనలు మరింతకాలం పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పట్టణాలన్నీ బోసిపోయాయని.. వ్యాపారాలు కుంటుపడ్డాయని.. అయినప్పటికీ ప్రజల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని అభిప్రాయపడ్డారు. వైద్య విభాగం సేవలు విస్త్రృతం చేయనున్నట్లు తెలిపారు.(ఆ మూడు దేశాల్లో 22 వేల మంది మృతి )

మరిన్ని వార్తలు