-

ప్రపంచ దేశాల్లో ప్రజా  దిగ్భందనం

19 Mar, 2020 14:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దిగ్భందనం చోటు చేసుకుంటోంది. ఇతర దేశాల ప్రజలు రాకుండా సరిహద్దులను పూర్తిగా మూసివేయాలని తాజాగా ఐరోపా కూటమి నిర్ణయించింది. యూరప్‌ ప్రయాణికులు రాకుండా ఆఫ్రికా దేశాలు నిషేధం విధించాయి. ఇతర దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. కోరనా కోరల్లో చిక్కుకున్న ఇటలీ, ఫ్రాన్స్‌ దేశాల్లో సంపూర్ణ ప్రజా దిగ్భందనం  అమలు చేస్తున్నాయి. ఇళ్ల నుంచి బయటికి రాకుండా ప్రజలను కట్టడి చేశాయి. విద్యా సంస్థలను, మాల్స్‌ను, మార్కెట్లను, థియేటర్లను మూసివేశాయి. సభలు, సమావేశాలు, మత కార్యాక్రమాలపై ఆంక్షలను విధించాయి. పలు ఐటీ కంపెనీలు ఇంటి నుంచి పని చేసేందుకు ఉద్యోగులను అనుమతించాయి. నిషేధాజ్ఞలను కచ్చితంగా అమలు చేయడానికి ఫ్రాన్స్‌లో లక్షమంది పోలీసులను రంగంలోకి దింపారు. (కరోనా: ఒక్కరోజే 475 మంది మృతి)

భారత్‌ తదితర ఆసియా దేశాల్లో విద్యా సంస్థలను, థియేటర్లను మూసివేశారు. పెళ్లి, వినోద కార్యక్రమాలపె తాత్కాలిక ఆంక్షలను విధించారు. అమెరికాలో పది మందికి మించి ప్రజలు సంచరించరాదంటూ నిషేధాజ్ఞలు విధించారు. కోవిడ్‌ అనుమానితులను వెంటనే నిర్బంధ ఆరోగ్య శిబిరానికి తరలించాలంటూ అధికారులను ఆదేశించారు. మరో ఎనిమిది వారాలపాటు నిషేధాజ్ఙలు అమల్లో ఉంటాయని అమెరికా రోగ నియంత్రణా కేంద్రాలు భావిస్తున్నాయి. నిషేధాజ్ఞలు మరికొన్ని నెలలపాటు కొనసాగించాల్సి రావచ్చని పలు దేశాలు భావిస్తున్నాయి. 2021 సంవత్సరంలో కరోనాను నిరోధించే వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. (హృదయ విదారకం.. కన్నీళ్లు ఆగడం లేదు)

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపె కూడా కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. ప్రపంచ ఆర్థిక స్టాక్‌ మార్కెట్లకు ఒక్క ఫిబ్రవరి ఆఖరి వారంలోనే ఐదు లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ నుంచి యురోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వరకు ఆర్థిక సంక్షోభాన్ని నిరోధించేందుకు వడ్డీ రేటును గణనీయంగా తగ్గించాయి. అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీ రేటును దాదాపు జీరో చేసింది. చైనా నుంచి జర్మనీ వరకు ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు అసాధారణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరో పక్క అంతర్జాతీయంగా చమురు రేట్లు పతనమయ్యాయి. మొదట తీవ్రంగా కరోనా బారిన పడిన చైనా, దక్షిణ కొరియా దేశాల్లో కఠిన చర్యల ద్వారా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఎక్కువ మరణాలు సంభవించిన ఇటలీలోనే పరిస్థితి తీవ్రంగా ఉంది.  (మాస్క్లు, గ్లోవ్స్ కంటే ఇదే ముఖ్యం)

మరిన్ని వార్తలు