కరోనా వైరస్‌ గుప్పిట్లో చైనా..!

24 Jan, 2020 10:17 IST|Sakshi

బీజింగ్‌: కరోనా.. కరోనా.. ఒకప్పుడు సార్స్, మెర్స్ లాగా... ఇప్పుడీ కొత్త వ్యాధిపై ప్రజలు, ప్రభుత్వాలు మాట్లాడుకుంటున్నాయి. ఎందుకంటే ఆ వ్యాధి అలా భయపెడుతోంది మరి. చైనాలో మొదలై, జపాన్, అమెరికా, సౌదీ అరేబియా ఇలా కొన్ని దేశాల్లో ఈ వ్యాధి సోకిన కేసులు బయటపడుతుంటే.. ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. చైనాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గురువారం వరకు చైనాలో ఈ వైరస్‌ సోకి 25మంది మృతి చెందారు. మరో 830 మందికి వైరస్‌ సోకినట్లు శుక్రవారం చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. అత్యధికంగా వుహాన్‌లో వైరస్‌ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు హెల్త్‌ కమిషన్‌ చెప్పింది. చైనా, థాయ్‌లాండ్, హాంగ్‌కాంగ్‌, దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. (కరోనా బారిన కేరళ నర్స్‌)

జపాన్‌, కొరియాల్లో ఒక్కొక్కరికీ, థాయ్‌లాండ్‌లో ముగ్గురికి సోకింది. అమెరికాలోని సియాటిల్‌లో ఒకరికి వచ్చింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితిని విధించింది. కాగా.. ప్రపంచ దేశాలను దృష్టిలో ఉంచుకొని దానిని నివారించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. పరిస్థితి రోజురోజుకు తీవ్రమవుతున్న తరుణంలో.. భారత ప్రభుత్వం కూడా అలర్ట్‌ అయ్యింది. విదేశాలనుంచి వచ్చే ప్రయాణికులు విమానాశ్రయాల్లో దిగగానే వాళ్లను అ​​క్కడి నుంచి టెస్టింగ్ సెంటర్‌లకి పంపుతున్నారు. అక్కడ వారికి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేసి వైరస్ లేదని నిర్ణయించుకున్నాకే గమ్యస్థానాలకు పంపుతున్నారు. ఒకవేళ ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తే వారిని స్పెషల్‌గా టెస్ట్ చేస్తున్నారు. విషయం తేలకపోతే ఆస్పత్రికి కూడా పంపిస్తున్నారు. ఇలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. (చైనాను వణికిస్తున్న ‘కరోనా’)

(చైనా నుంచి ప్రమాదకరమైన వైరస్‌)

(హైదరాబాద్ లో ‘కరోనా’ అలర్ట్‌!)

మరిన్ని వార్తలు