లాక్‌డౌన్‌: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు!

4 Apr, 2020 12:56 IST|Sakshi
పెరుగుతున్న గృహహింస కేసులు(కర్టెసీ: టైమ్‌)

న్యూఢిల్లీ: ఓ వైపు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తుంటే... కొంతమంది కీచకులు మాత్రం విపత్కర పరిస్థితుల్లోనూ తమ వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధిస్తే దానిని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గత 20 రోజులుగా పెరుగుతున్న గృహ హింస కేసులే ఇందుకు నిదర్శనం. మార్చి 24న  భారత్‌లో 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో మార్చి మొదటివారంతో పోలిస్తే.. మార్చి 30 నాటికి గృహహింస కేసుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. 111గా కేసుల సంఖ్య 257కు చేరిందని జాతీయ మహిళా కమిషన్‌ వెల్లడించింది. కాగా లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేసే విధుల్లో పోలీసులు తలమునకలైన వేళ మహిళలపై అకృత్యాల సంఖ్య పెచ్చుమీరుతున్నట్లు తెలుస్తోంది.  వేలాది మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్నా.. వారిలో కేవలం ఒక శాతం మంది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఫిర్యాదు చేసేందుకు రావడం లేదని సమాచారం. అయితే ఇది కేవలం ఒక్క భారత్‌కే పరిమితమైన అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అకృత్యాల బారిన పడుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.(కరోనా: ‘ప్లాస్మా థెరపీ’తో చెక్‌!)

యూరప్‌ దేశాల్లో..
ఇటలీ, స్పెయిన్‌ వంటి యూరప్‌ దేశాల్లో కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటలీలో ఈ మహమ్మారి కారణంగా దాదాపు 10 వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా హెల్‌‍్ప లైన్లతో అధికారులు బిజీగా ఉండగా... గృహహింస బాధితులు టెక్ట్స్ మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ ద్వారా తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఉండేందుకే వారు ఈ మార్గాలను ఎంచుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఫ్రాన్స్‌లో..
పొరుగు దేశాలపై కరోనా పంజా విసురుతున్న తరుణంలో ఫ్రాన్స్‌ మార్చి 17 నుంచి లాక్‌డౌన్‌ విధించింది. ఇక ఆనాటి నుంచి కేవలం వారం రోజుల్లోనే గృహహింస కేసుల సంఖ్య 32 శాతానికి చేరింది. ముఖ్యంగా రాజధాని ప్యారిస్‌లో ఈ గణాంకాలు 36 శాతానికి చేరడం ఆందోళనకరంగా పరిణమించింది.(కరోనా: మరో షాకింగ్‌ న్యూస్‌!)

స్పెయిన్‌లో..
ఇటలీ తర్వాత ఎక్కువ కరోనా మరణాలు స్పెయిన్‌లోనే సంభవించాయి. ఈ క్రమంలో అక్కడ మార్చి 14 నుంచి లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ మార్చి మొదటి రెండు వారాల్లో గృహ హింస బాధితుల సంఖ్య 12 శాతం పెరిగింది. హెల్‌‍్పలైన్‌ వెబ్‌సైట్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదుల సంఖ్య ఏకంగా 270 శాతం పెరిగింది. 

చైనాలో..
ఇక ఆసియా దేశం చైనాలోని హుబే ప్రావిన్స్‌లో గృహ హింస ఫిర్యాదుల సంఖ్య గతేడాది(47)తో పోలిస్తే 162కు పెరిగింది. కాగా ఇక్కడే వుహాన్‌ నగరంలో కరోనా వైరస్‌ 2019 చివర్లో పురుడు పోసుకున్న విషయం తెలిసిందే.(అక్కడ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం చేస్తారంటే!)

అగ్రరాజ్యంలో..
కరోనా కారణంగా అమెరికా ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా న్యూయార్క్‌, న్యూజెర్సీ నగరాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో జాతీయ గృహహింస నిరోధక సంస్థ హాట్‌లైన్‌కు రోజుకు సగటున 2 వేల కాల్స్‌ వస్తున్నాయి. అందులో 950 కరోనా కేసులకు సంబందించినవి కాగా మిగితావి గృహహింస ఫిర్యాదులకు సంబంధించినవి. ఇక సీటెల్‌లో వీటి సంఖ్య 21 శాతం పెరిగింది.

కాగా బ్రెజిల్‌, ఆస్ట్రేలియా, కాటలోనియా దేశాల్లోనూ పరిస్థితికి ఇందుకు భిన్నంగా లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు హామీ ఇస్తున్నా.. భారత్‌ వంటి దేశాల్లో కొంతమంది మహిళలు అత్తింటివారికి భయపడి ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని మహిళా హక్కుల సంఘాలు అంటున్నాయి. ఈ మేరకు జీ న్యూస్‌ కథనం వెలువరించింది.

మరిన్ని వార్తలు