ప్రచారానికి ఫేక్‌ వైరస్‌

10 Feb, 2020 03:42 IST|Sakshi

కరోనాపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు

అపోహల్ని తొలగించడానికి డబ్ల్యూహెచ్‌ఓ ప్రయత్నం  

జెనీవా: చైనా సహా ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్‌పై వస్తున్న వార్తల్లోనూ, జరుగుతున్న ప్రచారంలోనూ నిజానిజాలెంత? వైరస్‌ ఎలా సోకుతుందన్న దగ్గర నుంచి మృతుల సంఖ్య వరకు గందరగోళం నెలకొని ఉంది. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగాక విపత్తుల సమయంలో అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా తప్పుడు వార్తలు ప్రచారం అవుతు న్నాయి.

అయితే చైనాలో అత్యధికులు ఫాలో అయ్యే ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ వారం క్రితం కరోనా మృతుల సంఖ్య 25 వేలకు దగ్గర్లో ఉందని కథనాన్ని ప్రచురించి, ఆ మర్నాడే ఆ సంఖ్యని మార్చేసి అధికారికంగా ప్రభుత్వం వెల్లడించిన మృతుల సంఖ్య ఉంచడంతో ఆందోళనలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇంటర్నెట్‌లో రకరకాల వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తప్పుడు వార్తలు ప్రచారం చేసే ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఖాతాలను బ్లాక్‌ చేస్తోంది. కరోనాపై అపోహల్ని తొలగిస్తోంది. అవేంటో చూద్దాం..

► ప్రచారం: మాంసం తింటే కరోనా వైరస్‌ సోకుతుంది.
♦ వాస్తవం: ఈ మధ్యకాలంలో చైనాలో గబ్బిలం మాంసం తింటున్న వీడియోలు సోషల్‌ మీడియాలో పెట్టేవారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకే చైనీయుల ఆహార అలవాట్లు వల్లే కరోనా వైరస్‌ సోకుతోందని ప్రచారం జరుగుతోంది. డబ్ల్యూహెచ్‌ఓ అధికారులు ఈ ప్రచారాన్ని తోసిపుచ్చారు. వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో కొత్త వైరస్‌లు రావడం సర్వసాధారణమని అంటున్నారు. ఈ వైరస్‌కి కారణం పాములా, గబ్బిలాలా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదన్నారు.

► ప్రచారం: చైనా నుంచి వచ్చే ప్యాకేజీలు తీసుకున్నా కరోనా కమ్మేస్తుంది.
♦ వాస్తవం: వైరస్‌లు ఎప్పుడూ భూ ఉపరితలంపై ఎక్కువ కాలం జీవించి ఉండలేవు. అందుకే చైనా నుంచి వచ్చే లేఖలు, ప్యాకేజీలు వంటివి తీసుకున్నా ఎలాంటి ప్రమాదం ఉండదు.  

► ప్రచారం: పెంపుడు జంతువులకి కూడా కరోనా వైరస్‌ సోకుతుంది.
♦ వాస్తవం: ఇంట్లో కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులుంటే వాటికి కూడా కరోనా వైరస్‌ సోకుతోందంటూ అవి మరణించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అయితే కుక్కలు, పిల్లులకి కరోనా సోకుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్‌ఓ తన వెబ్‌సైట్లో స్పష్టం చేసింది.  

► ప్రచారం: రేయింబవళ్లు మాస్క్‌లు ధరిస్తే కరోనా వైరస్‌ సోకదు.
♦ వాస్తవం: మాస్క్‌లు ధరించినంత మాత్రాన వైరస్‌ సోకదని చెప్పలేం. మాస్క్‌ల వల్ల చిన్నా చితకా ఇన్‌ఫెక్షన్లు మాత్రమే నిరోధించగలం. కానీ మొండి వైరస్‌లు సోకకుండా మాస్క్‌లు కూడా నిరోధించలేవు. చేతులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటే కొంత ప్రయోజనం ఉంటుంది. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటేనే కరోనాను తట్టుకోగలరని అధికారులు స్పష్టం చేశారు.  

► ప్రచారం: వెల్లుల్లి తినడం, నువ్వుల నూనె రోజూ శరీరానికి రాసుకోవడం, ఉప్పు నీళ్లతో తరచూ పుక్కిలించడం చేస్తే వ్యాధి రాదు.
♦ వాస్తవం: ఇదంతా తప్పుడు ప్రచారమే. వెల్లుల్లి బ్యాక్టీరియాను నిరోధిస్తుంది తప్ప వైరస్‌లను కాదు. అదే విధంగా ఉప్పు నీళ్లు పుక్కిలించడం, నువ్వుల నూనె రాసుకోవడం కూడా. వీటి వల్ల ఎప్పుడూ ఉండే సాధారణ ప్రయోజనాలే తప్ప కరోనాని నియంత్రించలేవు.

► ప్రచారం: మిరాకిల్‌ మినరల్‌ సొల్యూషన్‌ వైరస్‌ని చంపేస్తుంది.
♦ వాస్తవం: క్లోరిన్‌ డయోక్సైడ్‌తో కూడిన మిరాకిల్‌ మినరల్‌ సొల్యూషన్‌ తాగితే కరోనా వ్యాధి తగ్గిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేన్సర్, హెచ్‌ఐవీ, ఆటిజమ్‌ను కూడా తగ్గిస్తుందని సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు. కానీ అది శుద్ధ అబద్ధం. ఆ ద్రావణాన్ని తాగితే వాంతులు, లివర్‌ ఫెయిల్యూర్‌ వంటివి జరుగుతాయని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది.

మరిన్ని వార్తలు