కరోనా: 20 వేలు దాటిన మరణాలు.. అత్యధికంగా అక్కడే

26 Mar, 2020 09:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మరణాలు 20 వేలు.. నాలుగున్నర లక్షల మందికి సోకిన మహమ్మారి

మాడ్రిడ్‌: ప్రాణాంతక కోవిడ్‌-19(కరోనా వైరస్‌) రోజురోజుకీ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. సుమారు నాలుగున్నర లక్షల మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 బిలియన్ల మంది ఇంటికే పరిమితమయ్యారు. ఇక చైనాలోని వుహాన్‌ పట్టణంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్‌ ధాటికి అక్కడ 3500 మందికి పైగా మృతి చెందగా.. స్పెయిన్‌, ఇటలీలో దీని ప్రభావం అంతకంతకూ పెరుగుతూ ఉంది. చైనా కంటే ఎక్కువ మరణాలు ఈ దేశాల్లో సంభవించడం ఆందోళనకరంగా పరిణమించింది. కరోనా కారణంగా ఇటలీలో 7,503 మంది మరణించగా.. స్పెయిన్‌లో ఒక్కరోజే 738 మంది మృతి చెందారు. అప్రమత్తంగా లేని కారణంగానే ఈ దుస్థితి తలెత్తిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. (కరోనా: ప్రఖ్యాత చెఫ్‌ మృత్యువాత)

కాగా రష్యాలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడినట్లు అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే వారంరోజుల పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పబ్లిక్‌ హాలిడే ప్రకటించారు. ఈ క్రమంలో రాజ్యాంగ సవరణలు, సంస్కరణలకై చేపట్టాల్సిన ఓటింగ్‌ను వాయిదా వేసినట్లు సమాచారం. కాగా ఫ్రాన్స్‌లో బుధవారం నాటికి 231 మంది ముత్యవాత పడ్డారు. ఇదిలా ఉండగా... జీ20 ముఖ్య దేశాలు కరోనా సంక్షోభం గురించి చర్చించేందుకు గురువారం వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచ దేశాలు కరోనాను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి 2 బిలియన్‌ డాలర్ల అత్యవసర నిధిని ప్రకటించింది.(కరోనా: ఆలస్యం చేస్తే ఇటలీ, అమెరికాలాగే..)

కరోనా వైరస్‌: ఎందుకంత ప్రమాదకారి?

మరిన్ని వార్తలు