అగ్రరాజ్యంలో కరోనా కల్లోలం.. 11 మంది భారతీయుల మృతి

9 Apr, 2020 09:46 IST|Sakshi

వాషింగ్టన్‌ : కరోనా మహమ్మారితో అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే 14 వేలమందికి పైగా మృతి చెందారు. బుధవారం ఒక్కరోజే దాదాపు 2 వేల మంది మృత్యువాత పడ్డారు. కరోనా ఎఫెక్ట్‌ అమెరికాలో ఉంటున్న భార‌తీయులపై కూడా పడింది. కఠిన నిబంధ‌న‌ల‌తో  భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంత‌ర్జాతీయంగా ప్ర‌యాణాలు నిలిచిపోవ‌డంతో బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. అయితే.. ఇందులో ప‌లువురు క‌రోనా బారిన‌ప‌డి చ‌నిపోయినట్లు తెలుస్తోంది. మ‌రికొంద‌రు చికిత్స పొందుతున్నారు.
(చదవండి : మరణాలు తక్కువగానే ఉంటాయేమో)

ఇప్పటివ‌ర‌కు 11మంది భార‌తీయులు క‌రోనాతో చ‌నిపోయిన‌ట్లు సమాచారం. వీరిలో 10 మంది న్యూయార్క్‌, న్యూజెర్సీ నగరాలకి చెందిన వారు కాగా, ఒక్కరు ఫ్లోరిడాలో నివాసం ఉంటన్న వ్యక్తిగా గుర్తించారు. ఇక మృతుల్లో న‌లుగురు ట్యాక్సీ డ్రైవ‌ర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మ‌రో 16 మంది భారతీయులు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది న్యూయార్క్‌లో, ముగ్గురు న్యూజెర్సీలో, మిగిలినవారు టెక్సాస్, కాలిఫోర్నియాలో ఉన్నారు. నిర్భంధంలో ఉన్నవారిలో నలుగురు మహిళలు ఉండడం గమనార్హం. వీరంతా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, కర్ణాటక రాష్ట్రాలు చెందినవారని అధికారులు తెలిపారు.

కాగా, కరోనావైరస్ బారిన పడిన భారతీయులకు అవసరమైన సహాయం అందించడానికి భారత రాయబార కార్యాలయం,కాన్సులేట్లు స్థానిక అధికారులు ఎన్నారై సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. కఠిన నిబంధనలు అమలులో ఉండడం వల్ల మరణించిన భారతీయుల అంత్య‌క్రియ‌ల‌ను స్థానిక అధికారులే చేప‌డుతున్నారు. కుటుంబ స‌భ్యుల‌ను కూడా అనుమ‌తించ‌డం లేదని అధికారులు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు