కరోనా : జైలులో తిరుగుబాటు.. 23 మంది మృతి

23 Mar, 2020 17:02 IST|Sakshi

బొగోటా : కరోనా వైరస్‌ వ్యాప్తిపై జైళ్లలోని ఖైదీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు కరోనా విజృంభిస్తున్న వేళ జైలులో కనీస పారిశుద్ధ్యం కరువైందని, సరైన వైద్యసదుపాయాలు లేవని ఆరోపించిన ఖైదీలు అధికారులపై తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో జరిగిన అల్లర్లలో 23 మంది ఖైదీలు మరణించగా, 83 మంది గాయపడ్డారు. ఈ ఘటన కొలంబియా రాజధాని బొగోటాలోని లా మోడెలో జైలులో చోటుచేసుకుంది. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. 

వివరాల్లోకి వెళితే.. లా మోడెలో జైలులో పరిశుభ్రత లేదని అందువల్ల తమకు కరోనా సోకే అవకాశం ఉందని ఖైదీలు ఆరోపించారు. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. జైలు అధికారులపై తిరగబడటమే కాకుండా.. అక్కడ ఉన్న సామాగ్రికి నిప్పుపెట్టారు. దీంతో అప్రమత్తమైన జైళ్ల శాఖ అధికారులు వారిని కట్టడి చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో 23 మంది మృతిచెందారు. ఈ ఘటనపై న్యాయశాఖ మంత్రి కాబెలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం 32 మంది ఖైదీలు, ఏడుగురు భద్రతా సిబ్బంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో ఇద్దరు భద్రతా సిబ్బంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. జైలులో పథకం ప్రకారమే అల్లర్లు జరిగాయని చెప్పారు. జైల్లో పారిశుద్ధ్యానికి సంబంధించి ఎలాంటి సమస్య లేదని.. అల్లర్లు సృష్టించేందుకే ఖైదీలు ఇలా చేశారని అన్నారు. జైలులో ఏ ఒక్క ఖైదీకి కూడా కరోనా సోకలేదని, ఎవరినీ ఐసోలేషన్‌లో ఉంచలేదని ఆమె స్పష్టం చేశారు. 

కాగా, ఈ విషయం తెలసుకున్న ఆ జైలులోని ఖైదీల బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమవారి పరిస్థితి ఎలా ఉందో వెల్లడించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రత బలగాలు జైలు వద్దకు చేరకున్న తర్వాత కాల్పుల శబ్దాలు వినిపించాయని వారు అంటున్నారు. 

చదవండి : లాక్‌డౌన్‌ : రోడ్లపైకి జనం.. కలెక్టర్‌ ఆగ్రహం

భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల తయారీ నిలిపివేత..

మరిన్ని వార్తలు