కరోనా విలయం : ఈమె త్యాగం మహోన్నతం

1 Apr, 2020 11:00 IST|Sakshi
సుజాన్ హోయలార్ట్స్ (ఫైల్ ఫోటో)

కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రపంచమంతా వణికిపోతోంది. ఈ మహమ్మారి కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ లేకపోవడంతో వేలమంది ప్రాణాలు కోల్పోగా, లక్షలమంది ఈ వైరస్ బారిన పడ్డాయి. అయితే ఇంతటి మహా విలయంలో ఒక పెద్దావిడ అపూర్వమైన త్యాగం చేశారు. వైరసె సోకి ఆరోగ్యం విషమించిన పరిస్థితుల్లో కూడా తనకు  వెంటిలేటర్ వద్దని నిరాకరించారు. తనకు బదులుగా తనకంటే వయసులో చిన్న వారికి దాన్ని ఉపయోగించమని చెప్పారు. చివరకు కరోనా కాటుకు బలైపోయారు.

బెల్జియంకు చెందిన సుజాన్ హోయలార్ట్స్(90) ఈ మహమ్మారి బారిన పడ్డారు. వ్యాధి ముదరడంతో ఆకలి మందగించడంతోపాటు, శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. దీంతో ఆమెకు వెంటిలేటర్ అమర్చేందుకు వైద్యులు సిద్ధపడ్డారు. ఇక్కడే ఆమె పెద్దమనసును చాటుకున్నారు. ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఆమె తనకు కృత్రిమ శ్వాసక్రియను ఉపయోగించడం ఇష్టం లేదనీ, ఇప్పటికే చాలా మంచి జీవితాన్ని గడిపాను కనుక తనకు ఉపయోగించే ఆ పరికరాన్ని  వేరే ఎవరైనా చిన్న వయసున్న రోగులకు ఉపయోగించండి అని వైద్యులతో  చెప్పారు.  దురదృష్టవశాత్తు  ఆ తరువాత కొన్ని రోజులకే ఆమె కన్నుమూశారు.  దీంతో ఆమె త్యాగం మరువలేనిదంటూ  ఆమెకు చికిత్స అందించిన వైద్యులు సహా పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.

కాగా కరోనా వైరస్ కారణంగా పంచవ్యాప్తంగా ప్రస్తుతం 8,56,579పాజిటివ్ కేసులు నమోదు కాగా, 42,089 మంది మృతి చెందారు. ఈ మహమ్మారికి కచ్చితమైన మందు, వ్యాక్సిన్ ఏదీ అందుబాటులో రాకపోవడం మరింత ఆందోళన పుట్టిస్తోది.  దీనికితోడు  వేగంగా పెరుగుతున్న రోగుల సంఖ్య  కారణంగా చాలా ప్రాంతాల్లో వెంటిలేటర్ల కొరత వేధిస్తోంది. 

చదవండి : అమెరికాను వణికించిన భూకంపం 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు