చైనా ప్రాజెక్టులకు కరోనా సెగ

29 Jun, 2020 01:32 IST|Sakshi
పాక్‌లోని కారకోరంలో రోడ్డు పనులు చేస్తున్న చైనా కార్మికులు (ఫైల్‌)

40% పనులపై ప్రభావం

చైనా కలల ప్రాజెక్టులను కరోనా గట్టిగా దెబ్బ తీసింది. ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లతో వాణిజ్య సంబంధాల బలోపేతం, పెట్టుబడులే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలని డ్రాగన్‌ దేశం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు వైరస్‌ సెగ తగిలింది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ (బీఆర్‌ఐ) పేరిట చైనా ప్రారంభించిన మహానిర్మాణంలో అయిదో వంతు ప్రాజెక్టులపై కోవిడ్‌–19 ప్రభావం పడిందని చైనా విదేశాంగ శాఖలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్‌ జనరల్‌ జియోలాంగ్‌ వెల్లడించారు.

40 శాతం ప్రాజెక్టులపై అత్యంత తీవ్ర ప్రభావం, 30–40 శాతం ప్రాజెక్టులపై కొంతమేరకు కరోనా ప్రభావం పడిందని ఆయన చెప్పినట్టుగా సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు పత్రిక వెల్లడించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ 2013లో అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్‌ఐని ప్రారంభించారు. ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, గల్ఫ్‌ ప్రాంతం, ఆఫ్రికా, యూరప్‌లను రహదారి, సముద్ర మార్గాల ద్వారా కలుపుతూ బీఆర్‌ఐ మహా నిర్మాణంలో మొదలైంది. ఈ ఏడాది జనవరి నాటికి మొత్తం 2,951 ప్రాజెక్టుల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. వీటి విలువ 3.87 లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని ఒక అంచనా. ఈ ప్రాజెక్టుల్లో అధిక భాగం పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

సీపీఈసీపైనా ప్రభావం  
6 వేల కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న చైనా–పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సీపీఈసీ)పై కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. ఈ కారిడార్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మీదుగా వెళుతూ ఉండడంతో భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక కాంబోడియాలో సిహనౌకువిలే ప్రత్యేక ఆర్థిక మండలి, ఇండోనేసియాకు చెందిన జకార్తా–బాండంగ్‌ హైస్పీడు రైలు ప్రాజెక్టుల పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీనికి సంబంధించి చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహించి త్వరగా ఈ ప్రాజెక్టుల్ని ప్రారంభించాలని సూచించారు.

మరిన్ని వార్తలు