అమెజాన్‌లో కరోనా అలజడి

15 Apr, 2020 18:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య లండన్‌లోని డార్లింగ్టన్‌లోని ఆన్‌లైన్‌ రిటేల్‌ మార్కెట్‌ దిగ్గజం ‘అమెజాన్‌’  గిడ్డంగిలో అలజడి మొదలయింది. కరోనా వైరస్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను కూడా కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ ప్యాకర్లు ఆందోళన చేపట్టారు. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్లు, ముఖానికి మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు సరఫరా చేయక పోవడమే కాకుండా కార్మికుల మధ్య కనీస దూరాన్ని పాటించే పరిస్థితి లేదని, అందుకు యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. (కరోనా : అమెజాన్లో 75 వేల ఉద్యోగాలు)

అమెజాన్‌ గిడ్డంగిలో కొన్ని వందల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పని చేస్తున్నారు. వారంతా  తమకు కరోనా బారిన పడకుండా తగిన రక్షణ కావాలంటూ  కాసేపు పనులు నిలిపేసి వాకౌట్‌ చేయడంతో వారిపైన కంపెనీ యాజమాన్యం మండిపడిందట. ఆందోళన చేసిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించి కొత్త వారిని తీసుకుంటామంటూ బెదిరించిందట. ఈ విషయంలో కార్మికులు డార్లింగ్టన్‌ బొరోగ్‌ కౌన్సిల్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కంపెనీ క్యాంటీన్‌ కూడా కిక్కిర్సిపోతుందని వారు ఆరోపించారు. వెంటనే స్పందించిన కౌన్సిల్, కార్మికుడికి, కార్మికుడికి మధ్యన రెండు మీటర్ల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అమెజాన్‌ గిడ్డంగి నిర్వాహకులను ఆదేశించింది.  (నిత్యావసరాలకు మాత్రమే ఓకే..)

అయినప్పటికీ గ్లౌజులు, మాస్క్‌ల లాంటివి సరఫరా చేయక పోవడంతో కార్మికులు గత రాత్రి పని వేళల్లో యాజమాన్యం వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని కొంత మంది కార్మికులు మీడియాకు తెలియజేశారు. ఇది వరకు ఇదే డిమాండ్‌పై ఆందోళన చేసిన కొంతమంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలగించినట్లు వారు చెప్పారు. కంపెనీ సామాజిక దూరం పాటించాల్సిందిగా తామే కాకుండా కాంట్రాక్టర్లు ఇచ్చిన మార్గదర్శకాలను గిడ్డంగిలో పని చేస్తున్న కొంత మంది కార్మికులు పాటించక పోవడం శోచనీయమని అమెజాన్‌ అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.  (అమెజాన్‌, ఫేస్‌బుక్‌కు కరోనా సెగ)

మరిన్ని వార్తలు