కరోనా మరణాలు @ 7007

17 Mar, 2020 04:47 IST|Sakshi
నెదర్లాండ్స్‌లోని అల్‌స్మీర్‌లో వేలంకేంద్రంలో ఎవరూ కొనకపోవడంతో పారబోసేందుకు సిద్ధంచేసిన ఖరీదైన పూలు

బీజింగ్‌/టెహ్రాన్‌/జెనీవా: చైనాలో నమోదైన కోవిడ్‌ మరణాల కంటే ప్రపంచంలోని ఇతర దేశాల్లో నమోదైన మరణాల సంఖ్యే ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సోమవారం తెలిపింది. ఏఎఫ్‌పీ వార్తాసంస్థ లెక్కల ప్రకారం 142 దేశాల్లో 1,75,536 కేసులు నమోదుకాగా, మరణాల సంఖ్య 7007 దాటింది.  చైనాలో 3,213 మంది మరణించగా, ఇటలీలో 2,158, ఇరాన్‌లో 853, స్పెయిన్‌లో 297 మంది మరణించారు. వైరస్‌ అని అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ పరీక్షించాలని డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ దేశాలకు సూచించింది.

వైరస్‌ వ్యాప్తిని నిరోధించే చర్యలను భారత్‌ సహా ప్రపంచ దేశాలు ముమ్మరం చేశాయి. ఫ్రాన్స్‌లో తొలివారం 12గా ఉన్న నిర్ధారిత కేసుల సంఖ్య నాలుగువారాలు గడిచేనాటికి 4500కి పెరిగింది. ఇరాన్‌లో ఈ సంఖ్య 12,700కి చేరింది.  ఇటలీలో 24వేల మందికి వైరస్‌ సోకింది. ఇటలీలో మృతుల సంఖ్య రెండు వేలు దాటింది. స్పెయిన్‌లోనూ నాలుగు వారాల వ్యవధిలో కోవిడ్‌ కేసుల సంఖ్య 8 నుంచి 6 వేలకు పెరిగింది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా పాజిటివ్‌గా తేలిన కేసుల సంఖ్య తక్కువే.

చాలా దేశాలు పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి. సినీ థియేటర్లు, పబ్‌లు, బార్లు, షాపింగ్‌ మాల్స్‌ను మూతపడ్డాయి. సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేయసాగాయి. స్పెయిన్, చాలా దేశాలు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ప్రజలను ఇళ్లల్లోనే ఉండాలని ఆదేశించాయి. అమెరికాలోనూ కరోనా కేసుల సంఖ్య 3 వేలు దాటింది. 50, అంతకన్నా ఎక్కువ మంది పాల్గొనే కార్యక్రమాలను వచ్చే 8 వారాల పాటు వాయిదా వేసుకోవాలని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సంస్థ  సూచించింది.

చైనాలో అదుపులోకి..
కరోనా తమ దేశంలో అదుపులోకి వచ్చినట్లే అని చైనా వైద్య నిపుణులు ప్రకటించారు. అయితే తుది నిర్ణయం నెల తర్వాత తీసుకుంటామని పెకింగ్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రి డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ కావ్‌ లీ తెలిపారు. వూహాన్‌ ప్రాంతంలో పలువురు ఇతర వైద్యులతో పర్యటించిన కావ్‌ లీ విలేకరులతో మాట్లాడారు. వాతావరణానికి, కరోనా వైరస్‌కు సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకూ ఎలాంటి రుజువు లభించలేదని డాక్టర్‌ కావ్‌ లీ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు