చైనా సంకల్పం : కేవలం 10 రోజుల్లోనే..

3 Feb, 2020 09:41 IST|Sakshi

బీజింగ్‌ : చైనాలో ప్రాణంతక కరోనా వైరస్‌ విజృంభిస్తుంది. ముఖ్యంగా వుహాన్‌ నగరంలో ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి నుంచి తమ పౌరులను కాపాడుకునేందుకు చైనా ప్రభుత్వం వేగంగా స్పందించింది. అందుకోసం వుహాన్‌ నగరంలో కేవలం పది రోజుల్లోనే ఓ  ప్రత్యేక ఆస్పత్రికి నిర్మించేందుకు చైనా సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం తీవ్రంగా శ్రమించిన చైనా యంత్రాంగం అనుకున్న సమయంలో ఆస్పత్రిని నిర్మించారు. 1000 పడకలతో నిర్మించిన ఈ హాస్పిటల్‌లో  419 వార్డులు ఉన్నాయి. అందులో 30 ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రిలో సోమవారం నుంచి వైరస్‌ బాధితులను చేర్చుకోనున్నట్టు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. 

కాగా, కరోనా వైరస్‌ బాధితుల కోసం జనవరి 25న ప్రారంభించిన ఈ ఆస్పత్రి నిర్మాణం ఫిబ్రవరి 2న పూర్తయింది. ఇందుకోసం 7వేల పైగా కార్మికులు పనిచేశారు. దాదాపు 1,000 మెషీన్లను ఈ నిర్మాణం కోసం వినియోగించారు. ఈ ఆస్పత్రిలో విధులు నిర్వరించేందకు పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)కు చెందిన 1400కు పైగా వైద్య సిబ్బందిని మోహరించారు. అందులో చాలా మంది డాక్టర్లు కూడా ఉన్నారు.  మరోవైపు కరోనా వైరస్‌ బారినపడి చైనాలో ఇప్పటివరకు 360 మంది మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. అలాగే 16,400 మందికి ఈ వైరస్‌ సోకినట్టు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు