కరోనా భయం వీడి.. మానవత్వం చాటారు

9 Mar, 2020 16:00 IST|Sakshi

బీజింగ్‌ : ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చైనాలో కరోనా పేరు వింటనే జనాలు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో కరోనా వ్యాప్తించకుండా చైనీయులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్‌లు ధరించడంతోపాటు.. ఒకరి దగ్గరకు మరోకరు వెళ్లకుండా దూరం పాటిస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా వారు ఓ మంచిపని కోసం ముందుకువచ్చారు. కరోనా ఆందోళనలు ఉన్నప్పటికీ.. రోడ్డుపై పడిపోయిన యాపిల్స్‌ను సమిష్టిగా తొలగించి మానవత హృదయాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

వివరాల్లోకి వెళితే.. చైనాలోని బోజౌలో రద్దీ ఉండే ఓ కూడలి వద్ద ట్రైసైకిల్‌ కారుకు తగలడంతో అందులోని యాపిల్స్‌ రోడ్డుపై పడిపోయాయి. అలాగే ఓ మనిషి కూడా కిందపడిపోయాడు. దీంతో ట్రాఫిక్‌కు చిన్నపాటి అంతరాయం కలిగించింది. అయితే కొద్దిక్షణాల్లోనే  అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు మానవత హృదయంతో స్పందించారు. కరోనా వైరస్‌ భయంతో ఇతరులకు దగ్గరిగా వెళ్లాలంటే భయపడిపోతున్న నేపథ్యంలో.. దానిని మరిచి సాయం చేయడానికి ముందుకొచ్చారు. దాదాపు 20 మంది కలిసి కేవలం నాలుగు నిమిషాల్లోనే రోడ్డుపై పడిపోయిన యాపిల్స్‌ను ఏరి బాక్స్‌ల్లో పెట్టారు. ఆ తర్వాత యాపిల్‌ బాక్సులను ట్రైసైకిల్‌లో ఎక్కించారు. 

అక్కడి సీసీటీవీ కెమరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఈ వీడియోను  చైనా న్యూస్‌ ఏజెన్సీ జిన్హువా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అయితే దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. మెజారిటీ నెటిజన్లు.. చైనా ప్రజల టీమ్‌ వర్క్‌ను ప్రశంసిస్తున్నారు. వారు చేసిన పని హృదయాన్ని కదిలించేలా ఉందని కొనియాడుతున్నారు. కొందరు మాత్రం ఇలాంటి చర్యలతో కరోనా వైరస్‌ మరింతగా వ్యాప్తి చెందుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన 3,600 మదికిపైగా మరణించారు.

చదవండి : కరోనా అలర్ట్‌ : స్కూల్స్‌ మూసివేత

కరోనా జయించాడు.. రికార్డు సాధించాడు!

మరిన్ని వార్తలు