కోవిడ్‌ ప్రపంచవ్యాప్త మహమ్మారి: డబ్ల్యూహెచ్‌ఓ

12 Mar, 2020 04:54 IST|Sakshi

జెనీవా: వందకుపైగా దేశాల్లో వేగంగా విస్తరించిన కరోనా వైరస్‌ (కోవిడ్‌–19)ను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) బుధవారం ప్రకటించింది. పలు దేశాలు ఈ వ్యాధి నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రెస్‌ అధానొమ్‌ గెబ్రియేసుస్‌ బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. చైనా వెలుపల కరోనా కేసులు 13 రెట్లు పెరిగాయన్నారు. సత్వర చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు ఆయన సూచించారు. ప్రజలు గుంపులు గుంపులుగా చేరే చోట వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్నారు. దీనిపై ఆయా దేశాలు దృష్టి పెట్టాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. మానవ జీవితాన్ని గౌరవిస్తూ, ఈ మహమ్మారిని ఆపే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న కరోనా కేసుల దృష్ట్యా మరణాలు పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనాను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రకటించడంతో ఇన్సూరెన్స్‌ కవరేజీ వర్తించదు.

బ్రిటన్‌ మంత్రికి కరోనా
బ్రిటన్‌ కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీ, ఆరోగ్య శాఖ ఉపమంత్రి నాడీన్‌ డోరిస్‌కు కోవిడ్‌ సోకింది. ఈమె గతవారం బ్రిటన్‌ ప్రధాని, ఇతర ఎంపీలు హాజరైన విందులో పాల్గొన్నారు. దాంతో ఎవరెవరికి వైరస్‌ సోకిందేమోనన్న ఆందోళన నెలకొంది. అమెరికాలో ఇప్పటివరకు 31 మంది మరణిస్తే, 38 రాష్ట్రాలకు ఈ వ్యాధి విస్తరించింది. వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. చైనాలో కరోనా వైరస్‌ కాస్త నిలకడగా ఉంటే, ఇరాన్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియాలో పరిస్థితి తీవ్రరూపం దాలుస్తోంది. ఇరాన్‌లో ఒక్కరోజే ఏకంగా 63 మంది మరణించారు.

ప్రపంచదేశాల్లో కరోనా కేసులు: ఇంచుమించుగా లక్షా 18 వేలు
మృతులు:     4,250కి పైగా
వ్యాధి విస్తరించిన దేశాలు:    107

>
మరిన్ని వార్తలు