కరోనా డేంజర్‌ బెల్స్‌

3 Feb, 2020 04:03 IST|Sakshi
వుహాన్‌ నుంచి ఎయిరిండియా విమానంలో ఆదివారం ఢిల్లీకి చేరుకున్న భారతీయులు

చైనాలో 300 దాటిన వైరస్‌ మృతులు

భారత్‌లో రెండో కేసు నమోదు 

ఫిలిప్పీన్స్‌లో తొలి మరణం

బీజింగ్‌ /న్యూఢిల్లీ: చైనాలోని వుహాన్‌లో బట్టబయలైన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. చైనాలో రోజురోజుకి వ్యాధిగ్రస్తులు పెరిగిపోతూ ఉంటే, చైనా వెలుపల ఫిలిప్పీన్స్‌లో తొలి మరణం సంభవించింది. ఇక భారత్‌లోని కేరళలో రెండో కరోనా కేసు నమోదు కావడం డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. ఇప్పటివరకు కరోనా వైరస్‌తో 305 మంది మరణిస్తే, 15వేల మంది వరకు ఈ వైరస్‌ సోకింది. 25 దేశాలకు విస్తరించింది.

వుహాన్‌ నుంచి∙ఫిలిప్పీన్స్‌కి వచ్చిన 44 ఏళ్ల చైనీయుడు ఈ వైరస్‌ కారణంగా మృతి చెందినట్టు ఫిలిప్పీన్స్‌ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి చైనా పలు చర్యలు చేపట్టింది. కరోనా వ్యాధితో మృతి చెందిన వారికి అంతిమ యాత్రలపై నిషేధం విధించింది. శవాలను పూడ్చిపెట్టకుండా, వారు మృతి చెందిన ప్రాంతానికి సమీపంలో ఉన్న శ్మశాన వాటికల్లో దహనం చేయాలని చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.  

కేరళలో రెండో కరోనా కేసు
మన దేశంలోని కేరళలో మరో కరోనా కేసు నమోదైంది. ఇటీవల చైనా నుంచి వచ్చిన విద్యార్థికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికారులు వెల్లడించారు. అయితే పుణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) నుంచి వచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. వుహాన్‌ యూనివర్సిటీ నుంచి కేరళకు వచ్చిన ఆ విద్యార్థికి కరోనా వైరస్‌ సోకినట్టు అనుమానం రావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజ వెల్లడించారు. మరోవైపు వుహాన్‌ నుంచి మరో 323 మంది భారతీయులు, ఏడుగురు మాల్దీవుల వాసుల్ని భారత్‌కు తీసుకువచ్చారు. వీరిని ఆర్మీ, ఐటీబీపీ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసుపత్రుల్లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.  

చైనాలో బర్డ్‌ ఫ్లూ భయం  
కరోనా వైరస్‌తోనే నానాయాతన పడుతున్న చైనాలో హెచ్‌5ఎన్‌1 బర్డ్‌ ఫ్లూ వ్యాధి బయల్పడింది. హుబాయ్‌ ప్రావిన్స్‌కు దక్షిణ సరిహద్దుల్లో హువాన్‌ ప్రావిన్స్‌లో ఈ వ్యాధి బయటకి వచ్చింది. షోయాంగ్‌ నగరంలోని పౌల్ట్రీలో ఈ వైరస్‌ బయటపడినట్టు చైనా వ్యవసాయం, గ్రామీణ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అక్కడ 7,850 కోళ్లు ఉంటే, 4,500 కోళ్లు ఈ వ్యాధితో చనిపోయాయి. మరో 17,828 కోళ్లను వ్యవసాయాధికారులే చంపేశారు. ఇప్పటికింకా మనుషులకు ఈ వ్యాధి సోకలేదు.

చైనా ప్రయాణికులకు భారత్‌ ఇ–వీసా రద్దు
చైనా నుంచి వచ్చే ప్రయాణికులు, ఆ దేశంలోని ఇతర దేశస్తులకు ఇ–వీసా సౌకర్యాన్ని భారత్‌ తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజింగ్‌లో భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలు చైనా మీదుగా ప్రయాణించే వారిని కూడా తమ దేశంలోకి రానివ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు