కరోనా కల్లోలం

8 Feb, 2020 02:22 IST|Sakshi
దక్షిణ కొరియాలోని గపియాంగ్‌లో ఓ చర్చిలో మాస్కులు ధరించి పెళ్లిచేసుకుంటున్న వేలాది కొత్త జంటలు

637కి పెరిగిన మృతులు..

గురువారం ఒక్కరోజే 73 మృతి

బీజింగ్‌/న్యూఢిల్లీ: చైనాలో కరోనా వైరస్‌ ధాటికి మరణిస్తున్న వారి సంఖ్య గురువారానికి మరింత పెరిగింది. ఈ వైరస్‌ బారిన పడి గురువారం నాటికి మొత్తం 637 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 73 మంది గురువారం రోజే చనిపోయారు. వారిలో వైరస్‌కు కేంద్ర బిందువుగా మారిన వుహాన్‌ పట్టణం ఉన్న హ్యుబయి ప్రావిన్స్‌లోనే 69 మంది మృతి చెందారు. అలాగే, చైనా వ్యాప్తంగా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయిన వారి సంఖ్య 31 వేలకు చేరుకున్నట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వైరస్‌ బారినపడి చికిత్స ద్వారా కోలుకున్న 1,540 మందిని డిశ్చార్జ్‌ చేశామన్నారు. కాగా, జపాన్‌లో నౌకాశ్రయంలోనే నిలువరించిన ఓ నౌకలో 41 మందికి వైరస్‌ సోకినట్లు ఆ దేశ ప్రభుత్వం  ప్రకటించింది. కాగా, తొలిసారి కరోనా వైరస్‌ ఉనికిని గుర్తించి అందరినీ హెచ్చరించిన డాక్టర్‌ లీ వెన్లియాంగ్‌ మరణంపై చైనా శుక్రవారం ఆవేదన వ్యక్తం చేసింది. డాక్టర్‌ లీ మరణంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో చైనా ఉన్నత స్థాయి బృందం ఒకదాన్ని విచారణ కోసం వుహాన్‌కు పంపింది.  

ప్రస్తుతం భారత్‌ సహా 27 దేశాలకు ఈ వైరస్‌ వ్యాపించింది. భారత్‌లో మూడు సహా చైనాయేతర దేశాల్లో మొత్తం 220 కేసులు నమోదయ్యాయి. మరోవైపు, కరోనా సాకుగా చూపుతూ పలు విమానయాన సంస్థలు చైనాకు విమానాలను రద్దు చేయడంపై ఆ దేశం ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌కు ఫిర్యాదు చేసింది. షాంఘైకి చెందిన టీఎంఐరాబ్‌ సంస్థ తయారు చేసిన 30 ప్రత్యేక రోబోలను ఆసుపత్రుల్లో మందులు చల్లడంతోపాటు వార్డుల్లో ఆహారం, మందుల సరఫరాకు ఉపయోగిస్తున్నారు. చైనాలోని వుహాన్‌ కేంద్రంగా పలు దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్‌ను కట్టడి చేసే ప్రయత్నాల్లో రోబో సేవలను ఉపయోగించుకుంటున్నారు. 

నౌకాశ్రయాల్లోనూ కరోనా స్క్రీనింగ్‌ 
కరోనా వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో దేశంలోని మొత్తం 12 ప్రధాన నౌకాశ్రయాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేపట్టినట్లు  ప్రభుత్వం వెల్లడించింది.  అనుమానితులను ప్రత్యేక గదుల్లో ఉంచి చికిత్స అందించడం తక్షణమే ప్రారంభించాలని అన్ని నౌకాశ్రయాలను ఆదేశించామని తెలిపింది. చైనా నుంచి భారత్‌ రావాలనుకుంటున్న వారి వీసాలను రద్దు చేశామని రాజ్యసభలో ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. కాగా, వైరస్‌ కారణంగా జపాన్‌ తీరంలో నిలువరించిన  నౌకలో భారతీయ సిబ్బంది,  ప్రయాణీకులు ఉన్నారని విదేశాంగ శాఖ తెలిపింది. కొద్ది రోజులుగా కేరళలో కరోనా వైరస్‌ కొత్త కేసులు వెలుగుచూడకపోవడంతో విపత్తు హెచ్చరికను ఆ రాష్ట్రం శుక్రవారం ఎత్తేసింది.

ట్రంప్, జిన్‌పింగ్‌ చర్చ 
కరోనా విజృంభణ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కరోనా రోగుల చికిత్సకు, వైరస్‌ కట్టడికి ‘పీపుల్స్‌వార్‌’ను ప్రారంభించామని ట్రంప్‌నకు వివరించారు. ఏదైనా ఒక సమస్యపై ప్రజల సహకారంతో విస్తృత, దీర్ఘకాలం పోరు అనే ఉద్దేశంతో ‘పీపుల్స్‌ వార్‌’ అనే సైద్ధాంతిక భావనను మావో తొలిసారి ఉపయోగించారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా