కరోనాపై డబ్ల్యూహెచ్‌ఓ యుద్ధం

1 Feb, 2020 04:13 IST|Sakshi
చైనాలోని వుహాన్‌లో ముఖానికి మాస్కు ధరించిన వ్యక్తి చనిపోగా, కరోనా కారణంగా అతని వద్దకు వెళ్లేందుకు ప్రజలు భయపడ్డారు. అనంతరం వైద్య బృందం మృతదేహాన్ని తరలించింది.

అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధింపు

213కి చేరుకున్న మృతుల సంఖ్య

భారత్‌ సహా 20 దేశాలకు వ్యాప్తి

బీజింగ్‌: చైనాలో వెలుగులోకి వచ్చి ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న మహమ్మారి నావల్‌ కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) యుద్ధం ప్రకటించింది. అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించింది. భారత్‌ సహా ఇప్పటికే 20 దేశాలకు ఈ వ్యాధి త్వరితగతిన విస్తరిస్తోంది. తాజాగా బ్రిటన్‌లో కూడా రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 213 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 10 వేల మంది ఈ వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు జెనీవాలో అత్యవసరంగా సమావేశమై  గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని విధిస్తున్నట్టుగా ప్రకటించింది. కాగా, ఈ వైరస్‌ సోకిన కేరళకు చెందిన వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని త్రిశూర్‌ వైద్యులు తెలిపారు.

చైనాకు బయల్దేరిన విమానం
కరోనా వైరస్‌ భయంతో వూహాన్‌లో బిక్కుబిక్కు మంటూ ఉన్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడానికి ఎయిర్‌ ఇండియా బీ746 విమానం శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి చైనాకు బయల్దేరి వెళ్లింది.  ఈ విమానంలో ఐదుగురు వైద్యులు అయిదుగురు, పారామెడికల్‌ స్టాఫ్‌ ఉన్నారు. 400 మంది భారతీయుల్ని తీసుకొని   శనివారం మధ్యాహ్నం వెనక్కి వస్తుంది. మరోవైపు సరిహద్దు భద్రతా దళం ఐటీబీపీ ఢిల్లీలో 600 పడకల ఆస్పత్రిని ప్రత్యేకంగా కరోనా వైరస్‌ బాధితుల కోసం సిద్ధం చేసి ఉంచింది.

అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీ అంటే..
ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడి ఏదైనా వ్యాధి ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ ఉంటే అన్ని దేశాలు కలసికట్టుగా పోరాడడానికి ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధిస్తారు. దీనినే పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కన్‌సర్న్‌ (పీహెచ్‌ఈఐసీ) అని అంటారు. పీహెచ్‌ఈఐసీ సూచించిన మార్గదర్శకాల ప్రకారం ప్రపంచ దేశాలు ఈ వ్యాధిపై సంయుక్తంగా పోరాటం చేయాలి. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని విధిస్తారు.  
ఇప్పటివరకు గ్లోబల్‌ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని అయిదు సార్లు విధించారు.
2009 – స్వైన్‌ ఫ్లూ; 2014 – ఎబోలా
2014 – పోలియో మళ్లీ పడగ విప్పినప్పుడు
2016– జికా వైరస్‌
2019– ఎబోలా

మరిన్ని వార్తలు