ప్లాస్మా థెరపీ చేయొద్దు

29 May, 2020 02:52 IST|Sakshi

ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నియంత్రణకు, కరోనా వచ్చిన వారికి అందజేస్తున్న వివిధ రకాల మందులను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. వాటివల్ల అనేక సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉంటాయని పేర్కొంది. ఇవన్నీ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని, వాటి తుది ఫలితాలు వచ్చే వరకు వాడటం శ్రేయస్కరం కాదని తేల్చి చెప్పింది. కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ వంటి చికిత్సలు చేయొద్దని స్పష్టం చేసింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్, లోపినావిర్, రిటోనానవిర్, రెమిడిసివిర్, యుమిఫినోవిర్, ఫావిపిరవిర్‌ వంటి మందులను కూడా వాడొద్దని తెలిపింది. రోగ నిరోధక శక్తి క్రమబద్ధీకరణకు ఉపయోగించే టొసిలిజుమాబ్, ఇంటర్‌ ఫెరాన్లను కూడా వాడొద్దని పేర్కొంది. ప్రస్తుతం కరోనాకు మందు లేదని తెలిపింది. ఈ మేరకు తాజాగా ‘క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ కోవిడ్‌–19’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది.సాధారణ, తేలిక పాటి కరోనా లక్షణాలున్న వారికి పారాసిటమాల్‌ వంటివి వాడితే సరిపోతుందని తేల్చి చెప్పింది.

సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎలా ఉంటాయంటే?
హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్‌ మాత్రలు వాడితే గుండె సంబంధిత సమస్యలు వస్తాయని తెలిపింది. లోపినావిర్, రిటొనావిర్‌ వాడితే జీర్ణాశ యానికి సంబంధించిన సమస్యలు వస్తాయని పేర్కొంది. రెమిడిసివిర్‌తో కాలేయ, కిడ్నీకి సంబం ధించిన సమస్యలు, దద్దుర్లు, బీపీ పెరుగుతుందని వివరించింది. యుమిఫినోవిర్‌తో డయేరియా, వాంతులు, ఫావిపిరవిర్‌ను వాడితే గుండె సంబం ధిత సమస్యలు వస్తాయని, ఇంటర్‌ఫెరాన్‌ వాడితే కండరాలు బలహీనంగా మారుతాయని తెలిపింది. టొసిలిజుమాబ్‌ వాడితే ముక్కు, గొంతుకు సంబం ధించిన ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కరోనా వచ్చిన గర్భిణులకు ప్రసవం చేయాల్సి వస్తే, తప్పనిసరిగా సిజేరియన్‌ చేయాలనేం లేదని పేర్కొంది. 

>
మరిన్ని వార్తలు