మరో నలుగురు వైద్య సిబ్బంది మృతి

18 Apr, 2020 18:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇంగ్లండ్‌లో కరోనా బారిన పడిన వారికి అవిశ్రాంతంగా వైద్య సేవలు అందిస్తున్న మరో నలుగురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో 54 మంది వైద్య సిబ్బంది మరణించారు. క్రోయ్‌డాన్‌లో జనరల్‌ ప్రాక్టీషనర్‌గా పని చేస్తున్న 57 ఏళ్ల క్రిషన్‌ అరోరా కరోనా వైరస్‌ బారిన పడి మరణించినట్లు ‘ది సౌత్‌ వెస్ట్‌ లండన్‌ క్లినికల్‌ కమిషనింగ్‌ గ్రూప్‌’ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. (వుహాన్ వైరాలజీ సంస్థలో 1500 వైరస్లు..!)

ఎడిన్‌బర్గ్‌ రాయల్‌ ఇన్‌ఫార్మరీలో పదవీ విరమణ చేయకుండా ఏ అండ్‌ ఈ వర్కర్‌గా పని చేస్తున్న 73 ఏళ్ల జాన్‌ మర్ఫీ వైరస్‌ బారిన పడి శుక్రవారం మరణించారు. ఆమెను సహచరులంతా ‘మా మర్ఫీ’ అంటూ ఆత్మీయంగా పిలిచే వారు. ఆమె దాదాపు 30 ఏళ్ల పాటు ఆస్పత్రికి సేవలందించారు. ముందుగా ఆసుపత్రిలో స్వీపర్‌గా చేరి ఆమె ‘క్లినికల్‌ సపోర్టింగ్‌ వర్కర్‌’గా పదోన్నతి పొందారు. మిడిల్స్‌బ్రోగ్‌లోని జేమ్స్‌కుక్‌ యూనివర్శిటీ ఆస్పత్రిలో పని చేస్తున్న పట్రిపియా క్రోహ్రస్ట్‌ అనే హెల్త్‌ వర్కర్‌ మంగళవారం చనిపోయారు. నలుగురు పిల్లల తల్లి అయిన ఆమె కరోనా బాధితులకు సేవలందించే క్రమంలో ఆ వైరస్‌ బారిన పడి మృత్యువాత పడ్డారు. (కరోనా మళ్లీ మళ్లీ రావచ్చు: డబ్ల్యూహెచ్)

ఉత్తర లండన్‌లో 26 ఏళ్ల సోంజా కేగాన్‌ అనే హెల్త్‌ వర్కర్‌ కరోనా బారిన పడి శుక్రవారం మరణించారు. ఆమెకు ఓ చిన్న పాప ఉంది. ఆమె ఎన్‌ఫీల్డ్‌లోని ఎలిజబెత్‌ లాడ్జ్‌ కేర్‌లో పని చేస్తున్నారు. వైద్య వృత్తిలో కొనసాగుతూ అకాల మృత్యువు పాలైన డాక్టర్‌ కిషన్‌ అరోరా నుంచి సోంజా కేగాన్‌ వరకు నలుగురు వృత్తిపరంగా అంకిత భావం కలిగిన వారే కాకుండా దయార్ద్ర హృదయులంటూ వారికి వారి మిత్రులు ఘనంగా నివాళులర్పించారు. వారిని వీరులుగా అభివర్ణించారు. (ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్కు ఏమైంది?)

మరిన్ని వార్తలు