జర్మన్ ఛాన్సలర్  సెల్ఫ్ క్వారంటైన్

23 Mar, 2020 10:00 IST|Sakshi
జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్

బెర్లిన్‌ : జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్  (65) తనకు తాను నిర్బంధంలోకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఆమెకు వైద్య పరీక్షలు చేసిన వైద్యుడికి ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్-19  వైరస్ సోకినట్టు నిర్ధారణైన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయానికి వచ్చారు.  దీంతో మెర్కెల్ స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. ఇంటినుంచే ఆమె తన అధికారిక  కార్యకలాపాలను నిర్వహించనున్నారని అధికార ప్రతినిధి స్టెఫెన్ సీబర్ట్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రమం తప్పకుండా మెర్కెల్కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు.  శుక్రవారం న్యుమోనియాకు వ్యతిరేకంగా మెర్కెల్‌కు  సదరు  వైద్యుడు టీకాలు వేసినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.

కరోనాపై పోరులో భాగంగా బహిరంగ సభలపై నిషేధాన్ని, ఇద్దరు కంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి తిరగడానికి వీల్లేదంటూ మెర్కెల్  నిషేధం విధించారు.  కరోనా నివారణకు చర్యలను ప్రకటించిన కొన్ని నిమిషాల్ల వ్యవధిలోనే మెర్కెల్ సెల్ఫ్ క్వారంటైన్ ప్రకటన వచ్చింది. అలాగే 822 బిలియన్ యూరోల ప్యాకేజీపై సంతకం చేయడానికి  సోమవారం నాటి కేబినెట్ సమావేశానికి ఆమె నేతృత్వం వహించాల్సి వుంది. తాజా పరిణామం నేపథ్యంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ వైస్-ఛాన్సలర్, ఆర్థిక మంత్రి ఓలాఫ్ స్కోల్జ్ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు తీవ్రమైన జలుబుతో బాధపడిన స్కోల్జ్ గత వారం సెల్ఫ్ క్వారంటైన్  విధించుకున్నారు. అయితే  కరోనా వైరస్ నెగటివ్  వచ్చిందని ఆ తరువాత ట్విటర్ ద్వారా వెల్లడించారు. కాగా జర్మనీలో 24వేల మందికి పైగా కరోనావైరస్ బారిన పడగా, దేశంలో ఇప్పటివరకు 94 మరణాలు సంభవించాయి.

మరిన్ని వార్తలు