రెమెడిసివిర్‌పై గిలియడ్ మరో కీలక అడుగు

30 May, 2020 10:54 IST|Sakshi

రెమెడిసివిర్ మార్కెటింగ్ అనుమతి కోరిన గిలియడ్  

సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ తన యాంటీ-వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ మార్కెటింగ్ అనుమతి కోరుతూ భారతదేశ డ్రగ్ రెగ్యులేటర్‌కు దరఖాస్తు చేసింది. ఇప్పటికే అమెరికా, జపాన్‌లో ప్రత్యేక అనుమతిని పొందిన ఈ సంస్థ తాజాగా తన మందును భారత్‌లో కూడా విక్రయించాలనుకుంటోంది. భారత్‌లో కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో కోవిడ్-19 చికిత్సలో సమర్ధవంతంగా పని చేస్తుందని గిలియడ్ భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే రెమెడిసివిర్ మార్కెటింగ్ అధికారాన్ని కోరుతూ కేంద్ర ప్రామాణిక ఔషధ నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీఓ)కు గిలియడ్ దరఖాస్తు చేసింది. రెమెడిసివిర్  ప్రీ-క్లినికల్,  క్లినికల్ అధ్యయనాల పూర్తి డేటా తమ వద్ద ఉందని, దీన్ని పరిశీలించి, సంబంధిత అనుమతులు మంజూరు చేయాలని రెమెడిసివిర్ పేటెంట్‌దారు అయిన గిలియడ్ కోరినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దీనిపై స్పందించిన సీడీఎస్ సీఓ నిపుణుల కమిటీ సహాయంతో దీన్ని పరిశీలించనుంది. ఈ సిఫారసుల ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని సంస్థ అధికారి వెల్లడించినట్టు సమాచారం. (అక్టోబరు చివరకు కరోనా వ్యాక్సిన్‌ : ఫైజర్‌)

రెండు భారతీయ  ఔషధ సంస్థలు సిప్లా, హెటెరో ల్యాబ్స్ భారతదేశంలో రెమిడెసివిర్ తయారీ, అమ్మకాలకు అనుమతి కోరుతూ డ్రగ్ రెగ్యులేటర్‌కు ఇటీవల దరఖాస్తు చేశాయి. అంతేకాకుండా రెమెడిసివిర్ క్లినికల్ ట్రయల్స్ రద్దు చేయాలని, తద్వారా రోగులకు వేగంగా అందుబాటులోకి తేవాలని కోరాయి. అయితే ఈ దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నాయని నియంత్రణ సంస్థ అధికారి తెలిపారు. ఈ క్రమంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు రెమిడెసివిర్ తయారీ, పంపిణీకిగాను సిప్లా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ హెటెరోతో సహా కొన్ని దేశీయ ఫార్మా సంస్థలతో గిలియడ్ ప్రత్యేకమైన లైసెన్సింగ్ ఒప్పందాలను ఇప్పటికే  కుదుర్చుకుంది. 

యుఎస్ క్లినికల్ డేటా ఆధారంగా , జపాన్ ఆరోగ్య, కార్మిక, సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఈ డ్రగ్ వినియోగానికి మే 7న  ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా 2019 న్యూ డ్రగ్ అండ్ క్లినికల్ ట్రయల్స్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక పరిస్థితులలో క్లినికల్ ట్రయల్స్‌ను రద్దు చేయడంతోపాటు రెమిడెసివిర్ వినియోగానికి అనుమతి లభించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.  

కాగా న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, వెంటిలేటర్‌పై ఉన్న ముగ్గురు కరోనా వైరస్ రోగులలో రెమెడిసివిర్ మందు ఇచ్చినప్పుడు ఇద్దరిలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. అటు ఆసుపత్రిలో చేరిన రోగులకు రెమెడిసివిర్ వినియోగించాలని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థ (యూఎస్ ఎఫ్‌డీఏ) ఇయుఎ జారీ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు