అందుకే బంగారం అమ్మేస్తున్నాం..

16 Apr, 2020 18:25 IST|Sakshi

బ్యాంకాక్‌ : బంగారాన్ని నమ్మినవారెవరూ నష్టపోరంటారు పెద్దలు.... ఇది థాయ్‌లాండ్‌ ప్రజలకు పక్కాగా వర్తిస్తుంది. ఆపద కాలంలో అక్కడ ప్రజలను పసిడి ఆదుకుంటోంది. సహజంగా బంగారాన్ని అమ్మడానికి ఎవరూ ఇష్టపడరు. ప్రాణం మీదకు వచ్చినప్పుడు మాత్రమే అమ్మడానికి చూస్తారు. అయితే కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి చేతిలో డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. (ఏడాది చివర్లో రూ 50,000 దాటేస్తుందా..?)

లాక్‌డౌన్‌తో థాయ్‌లాండ్‌ ప్రజలు నగదు లేక విలవిల్లాడుతున్నారు. దీంతో వారి దృష్టి బంగారం అమ్మకంపై పడింది. తమ దగ్గరున్న బంగారం విక్రయించి, సొమ్ము చేసుకునేందుకు ఎగబడుతున్నారు. బ్యాంకాక్‌లోని చైనాటౌన్‌లోని యోవారత్‌కు ప్రజలు పరుగులు పెడుతున్నారు. స్వర్ణం ధర భారీగా పెరగడం వారిలో ఆశలు రేకెత్తిస్తోంది. థాయ్‌లాండ్‌లో ఔన్స్‌ బంగారం ప్రస్తుతం 1,731 డాలర్లు పలుకుతోంది. గత ఏడేళ్లలో ఇదే అత్యధిక ధర. (లాక్‌డౌన్‌ 2.0 : ఆర్‌బీఐ కీలక నిర్ణయం )

ప్రజలు బంగారం అమ్ముకోవడానికి మాస్కులు ధరించి పెద్ద ఎత్తున జ్యూవెలరీ షాప్‌లకు బారులు తీరుతున్నారు. జనాల తాకిడి పోటెత్తడంతో ఆ దేశ ప్రధాని  ప్రయూత్ చాన్-ఓచా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం విక్రయిస్తే నగదు సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని, అవసరం మేరకే విక్రయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు జనాలను అదుపు చేసేందుకు ప్రత్యేకంగా స్థానిక అధికారులు కసరత్తు కూడా చేపట్టారు. (ఇంట్లోనే మద్యం తయారు చేసుకోవడం ఎలా? )

కాగా థాయ్‌లాండ్‌ ప్రజలు చేతిలో నగదు ఉంటే వాటిని బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతారు.  బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా, నమ్మకమైన పెట్టుబడిగా చూస్తారు. దీంతో అక్కడ ప్రజలు బంగారు ఆభరణాలను భారీగా కొనుగోలు చేసి, ధరలు పెరిగినప్పుడు అమ్మడం చేస్తుంటారు. బ్యాంకాక్‌లో పక్షం రోజులుగా లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో చేతిలో సరైన నగదు లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాలతో పాటు ఇతరత్రా అవసరాలకు థాయ్‌ ప్రజలు బంగారపు కడ్డీలతో పాటు, నగలను అమ్ముకుంటున్నారు. బంగారం ధర పెరగడంతో ఇందుకోసం ఉదయం నుంచే షాపుల వద్ద పడిగాపులు పడుతున్నారు. (విద్యార్థుల మృతదేహాలను రప్పించండి )

థానకార్న్‌ ప్రోమ్యూయెన్‌ మాట్లాడుతూ.. నా దగ్గర బ్యాంక్‌ బ్యాలెన్స్‌ లేదు. దీంతో నగదు కోసం నా దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. నాకు ఖర్చులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆదాయం లేకపోవడంతో వేరే గత్యంతరం లేకపోయిందని మరొకరు వాపోయారు. ఇప్పటివరకూ తన సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేదని అందుకే బంగారాన్ని అమ్ముతున్నట్లు ఓ వ్యాపారి తెలిపాడు. ఇక గత 60 ఏళ్లలో ప్రజలు ఈ విధంగా క్యూ లైన్లలో నిలబడి బంగారం అమ్మడాన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదని గోల్డ్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జిట్టి టాంగ్సిత్పాక్డి వ్యాఖ్యానించారు. (మీకు ఇలాంటి సంఘటన ఎదురైందా ?)

(ఆశ్చర్యం: గాలిపటం ఎగరేస్తున్న కోతి)

మరిన్ని వార్తలు