కరోనాతో అమెరికాలో పసికందు మృతి

29 Mar, 2020 11:06 IST|Sakshi

చికాగో: అమెరికాలో కరోనా విలయానికి ఓ ముక్కుపచ్చలరారని చిన్నారి బలైంది. చికాగోకు చెందిన నెలల పసికందు కోవిడ్‌-19 బారినపడి ప్రాణాలు విడిచిందని ఇల్లినాయిస్‌ ఆరోగ్యశాఖ (ఐడీపీహెచ్‌) శనివారం వెల్లడించింది. ఈ ప్రాణాంతక వైరస్‌ మూలంగా అమెరికాలో ఇంతవరకు వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారే ఎక్కువగా మరణించగా.. పసివాళ్లు చనిపోవడం ఇదే తొలిసారి అని తెలిపింది. చిన్నారి మరణంపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని ఐడీపీహెచ్‌ డైరెక్టర్‌ ఎంగోజి ఎంజికె చెప్పారు.

కరోనా కట్టడికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఇల్లినాయిస్‌ గవర్నర్‌ జేబీ ప్రిట్జకర్‌ తెలిపారు. చిన్నారి మరణం కలచివేసిందని అన్నారు. ప్రజా ప్రతినిధులుగా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు శాయశక్తులా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. మహమ్మారి కరోనాతో చనిపోయిన వారి కుంటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రాణాంతక వైరస్‌తో అన్ని వయసుల వారు ఇబ్బంది పడుతున్నప్పటికీ.. ప్రధానంగా వయసు మళ్లినవారికి ప్రమాదం ఎక్కువగా ఉందని చెప్పారు. ఇల్లినాయిస్‌లో మరణించిన వారిలో 85 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారే ఉన్నారని తెలిపారు. కాగా, అమెరికా వ్యాప్తంగా లక్షా 20 వేల కరోనా కేసులు నమోదు కాగా.. 2 వేల మరణాలు సంభవించాయి. ఇక ఇల్లినాయిస్‌లో 3491 కేసులు.. 47 మంది మరణించారు. మరణాల పరంగా ఇటలీ, స్పెయిన్‌, చైనా తరువాతి స్థానంలో అమెరికా నిలిచింది.

మరిన్ని వార్తలు