ఎట్టకేలకు భారత్‌ చేరుకున్న జ్యోతి

27 Feb, 2020 10:00 IST|Sakshi
కాబోయే భర్తతో జ్యోతి(ఫైల్‌) 

సాక్షి, మహానంది:  చైనాలోని వుహాన్‌లో చిక్కుకుపోయిన బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడుకు చెందిన అన్నెం జ్యోతి గురువారం ఇండియాకు తిరిగొచ్చింది. ఈ విషయాన్ని జ్యోతితో పాటు ఇండియన్‌ ఎంబీసీ అధికారులు ధ్రువీకరించినట్లు ఆమెకు కాబోయే భర్త అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. భారతదేశం నుంచి మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ వస్తుందని, నేటి (గురువారం) ఉదయం బయలుదేరేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని వుహాన్‌లో చిక్కుకున్న భారతీయులకు కేంద్ర ఆరోగ్య, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నుంచి మెసేజ్‌లు అందినట్లు ఆయన వెల్లడించారు. ఈక్రమంలో చైనా నుంచి ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ అబ్జర్వేషన్‌లో కొన్ని రోజులు ఉంచి, ఆ తర్వాత ఇంటికి పంపించనున్నారు. (జ్యోతిని క్షేమంగా రప్పించండి)

ఉద్యోగ శిక్షణ నిమిత్తం వుహాన్‌ వెళ్లిన జ్యోతి కోవిడ్‌ (కరోనా) వైరస్‌ నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయిన విషయం విదితమే. ఓ డార్మెటరీలో నెల రోజుల నుంచి ఉంటున్నారు. ఆమెకు ఇండియాకు రప్పించేందుకు తల్లి అన్నెం ప్రమీలాదేవి, కాబోయే భర్త అమర్‌నాథ్‌రెడ్డి, బావ సురేకుమార్‌రెడ్డిలు పలువురు ఎంపీలు, మంత్రులను కలిశారు. ముఖ్యంగా నంద్యాల ఎంపీ పోచా  బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని..జ్యోతి కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రుల వద్దకు తీసుకెళ్లి వినతిపత్రాలు ఇప్పించారు. ఈ నేపథ్యంలో జ్యోతిని ఇండియాకు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. (కేంద్ర మంత్రిని కలవనున్న జ్యోతి కుటుంబ సభ్యులు)

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కారణంగా చైనాలో చిక్కుకున్న76 మంది భారతీయులను, మరో 36 మంది పౌరులను భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకొచ్చింది. వీరిలో బంగ్లాదేశ్‌, యూఎస్‌ఏ, మయన్మార్‌, మాల్దీవులు, దక్షిణాఫ్రికాకు చెందిన వారున్నారు. కరోనా వైరస్‌తో అతలాకుతలం అవుతున్న చైనాకు భారత్‌ సహాయం అందించింది. భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో బుధవారం 15 టన్నుల వైద్య సామాగ్రిని పంపించింది. తిరుగు ప్రయాణంలో చైనాలో చిక్కుకున్న 112 మందిని భారత్‌కు తీసుకు వచ్చింది. గురువారం ఉదయం ఈ విమానం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి వారిని 14 రోజులపాటు ప్రత్యేక  వైద్య శిబిరంలో ఉంచి..  కోవిద్‌- 19 పరీక్షలు చేయనున్నారు.  కాగా భారతీయులను తరలించడానికి సహకరించిన చైనా ప్రభుత్వాన్ని విదేశాంగ శాఖ మంత్రి జయ శంకర్‌ అభినందించారు.

మరోవైపు జపాన్‌లోని డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో చిక్కుకున్న భారతీయులను రక్షించి ఎయిరిండియా ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం ఢిల్లీకి తరలించారు. నౌకలో చిక్కుకున్న 119 భారతీయులతో సహా శ్రీకంల, నేపాల్‌, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన అయిదురురిని టోక్యో నుంచి డిల్లీకి తీసుకొచ్చారు. వీరిని తరలించినందుకు కృషి చేసిన జపాన్‌ అధికారులకు, ఎయిర్‌ ఇండియాకు మంత్రి జయశంకర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ వైరస్‌ కారణంగా చైనాలో ఇప్పటికే 2,715 మంది మృత్యువాత పడగా. 78 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా