యువత అతీతం కాదు

22 Mar, 2020 04:43 IST|Sakshi
కొత్త కేబినెట్‌ మంత్రులతో గ్రూప్‌ ఫొటో దిగుతున్న స్లొవేకియా అధ్యక్షురాలు జురానా(మధ్యలో)

స్పష్టం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

11వేలు దాటిన మృతుల సంఖ్య

ఇటలీలో ఒక్కరోజే 793 మంది మృతి

ప్రపంచవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తం

రోమ్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వయో వృద్ధులను ఎక్కువగా బాధిస్తున్నప్పటికీ యువత ఈ మహమ్మారికి అతీతమేమీ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ తాకిడికి ప్రపంచం దాదాపుగా స్తంభించిపోగా.. జన జీవనం అస్తవ్యస్తమైనట్లు తెలుస్తోంది. వ్యాపారాలు, విద్యాలయాలు మూతపడిపోవడం, లక్షల మంది ఇళ్ల నుంచే పనిచేసుకోవడం మొదలుపెట్టడంతో మహానగరాలూ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇటలీలో ఒక్కరోజే 793 మంది మృతి చెందారు. ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 11,737కు చేరుకుంది.

ఇందులో 4వేలమంది ఇటలీ వారే కావడం గమనార్హం. వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 160 దేశాల్లో 2.75 లక్షలు దాటింది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా పీడితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కాలిఫోర్నియాతోపాటు న్యూయార్క్, ఇల్లినాయిల్లోనూ ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కోరాయి. మరోవైపు వైరస్‌కు పుట్టినల్లు అయిన చైనాలో వరుసగా మూడవ రోజూ కొత్త కేసులేవీ నమోదు కాకపోవడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రియాసిస్‌ శనివారం రోమ్‌లో మాట్లాడుతూ జబ్బు లక్షణాలు లేకపోయినా యువత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎక్కడికి వెళుతున్నారన్న విషయంపై వ్యాధి సోకే అవకాశాలు పెరిగిపోతాయని స్పష్టం చేశారు.

యూరప్‌లో కట్టడి చర్యలు ముమ్మరం
ఇటలీసహా యూరప్‌లో వైరస్‌ కట్టడి చర్యలు ముమ్మరమయ్యాయి. ఇటలీలో కోవిడ్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్త మరణాల్లో 36 శాతానికి చేరుకుందంటే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పైగా ఈ దేశంలో వ్యాధి బారిన పడుతున్న ప్రతీ100మందిలో 9మంది మరణిస్తున్నారు.  ఫ్రాన్స్, స్పెయిన్‌ తదితర దేశాల్లోనూ నిబంధనలను అతిక్రమించిన వారిపై భారీ జరిమానాలు విధించడం మొదలైంది.  బ్రిటన్‌ తాజాగా పబ్బులు, హోటళ్లు, థియేటర్లను మూసివేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కారణంగా ఉపాధి కోల్పోయే వారికి తగిన పరిహారం అందించాలని నిర్ణయించారు.

ఇరాన్‌లో మరో 123 మంది..
ఇరాన్‌లో కరోనా మరణ మృదంగపు ధ్వనులు పెచ్చరిల్లుతున్నాయి. ఒక్క రోజు వ్యవధిలో 123 మంది కరోనాకు బలవడంతో శనివారం నాటికి దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 1556కు చేరుకుందని ఆరోగ్యశాఖ అధికారి కియానౌష్‌ తెలిపారు. ఇరాన్‌లో 20,610కి వైరస్‌ సోకిందని వివరించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రజలు వాటిని పట్టించుకోవడం లేదని మార్చి 17 తేదీ నుంచి వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి కొన్ని లక్షల మంది రోడ్డు మార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లారని ఇరానియన్‌ రెడ్‌ క్రిసెంట్‌ సంస్థ తెలిపింది.   

కాలిఫోర్నియాలో వేయిపైనే
అమెరికాలోని ఒక్క కాలిఫోర్నియా రాష్ట్రంలోనే వెయ్యికిపైగా కేసులు నమోదు కావడం, 19 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాలూ ఒక్కటొక్కటిగా మేల్కొనడం మొదలైంది. ఏడు రాష్ట్రాల్లో  పది కోట్ల మందిని ఇళ్లకే పరిమితం చేసేశారు. ఏడు వేల కేసులు, 39 మరణాలు సంభవించిన న్యూయార్క్‌తోపాటు ఇల్లినాయిలో ప్రజలను ఇళ్లలోనే ఉండిపోవాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం అన్ని రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ అవసరం లేదని చెప్పారు.

అమెరికా, మెక్సికోల మధ్య రాకపోకలు అత్యవసర అవసరాలకు  పరిమితం చేసేందుకు అంగీకారం కుదిరిందన్నారు. ఉపాధ్యక్షుడు  పెన్స్‌ సిబ్బందిలో ఒకరికి కరోనా సోకినట్లు శుక్రవారం తెలిసింది. దేశం మొత్తమ్మీద ఇప్పటివరకూ 230 మంది వ్యాధి కారణంగా మరణించారు. ఆఫ్రికన్‌ దేశం గబాన్‌లో తాజాగా ఒక కొత్త కరోనా కేసు బయట పడింది. దక్షిణ అమెరికా దేశాలు క్యూబా, బొలీవియాలు తమ దేశ సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించగా కొలంబియా కూడా ప్రజలందరికీ నిర్బంధ ఐసొలేషన్‌ను మొదలుపెట్టనున్నట్లు తెలిపింది.

► సీబీఎస్‌ఈ టోల్‌ఫ్రీ నంబర్‌: వైరస్‌ నేపథ్యంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) టోల్‌ ఫ్రీ నంబర్‌ను  ప్రారంభించింది. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు 1800118004 నంబర్‌పై ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

► శానిటైజర్ల ధర: మాస్కులు, శానిటైజర్ల ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. వాటి గరిష్ట ధరలను శనివారం ప్రభుత్వం నిర్ణయించింది. 200 మి.లీటర్ల శానిటైజర్‌ ధర రూ.100 మించకూడదు. రెండు పొరల సర్జికల్‌ మాస్క్‌ ధర రూ. 8, మూడు పొరల సర్జికల్‌ మాస్క్‌ ధర రూ.10 మించకూడదు.

► కూలీలకు నగదు:  మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం కూలీలకు రూ. 1,000 నగదును, భవన నిర్మాణ కూలీలకు ఒక నెల రేషన్‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు యూపీ సర్కార్‌ ప్రకటించింది.

► సార్క్‌కు విరాళం: కరోనాను ఎదుర్కొనేందుకు  సార్క్‌ కరోనా ఎమర్జెన్సీ ఫండ్‌కు అఫ్గాన్‌ ప్రభుత్వం ఒక మిలియన్‌ డాలర్ల విరాళం ఇవ్వగా, మాల్దీవుల ప్రభుత్వం రెండు లక్షల డాలర్ల నిధులు ప్రకటించింది. 

కరోనా విలయం స్థూలంగా..
ప్రపంచవ్యాప్తంగా మరణాలు    11,737
వైరస్‌ సోకినవారు    2,77,106
ప్రభావితమైన దేశాలు    164
ఇళ్లకు పరిమితమైనవారు    100 కోట్లు

► కొలంబియాలో మంగళవారం నుంచి గృహ నిర్బంధం అమల్లోకి రానుంది.  
► అమెరికాలోని కాలిఫోర్నియా, ఇల్లినాయి, న్యూయార్క్, పెన్సెల్వేనియా, న్యూజెర్సీ, కనెక్టికట్, నెవెడాల్లోనూ ప్రజలు ఇళ్లకే పరిమితం. ప్రతి ఐదుగురు అమెరికన్లలో ఒకరిపై కరోనా వైరస్‌ ప్రభావం ఉంది.  

దేశం    మరణాలు    కేసులు
ఇటలీ    4,825    53,578
చైనా    3,255    81,008
ఇరాన్‌    1,556    20,610
స్పెయిన్‌    1,326    24,926
ఫ్రాన్స్‌    450    12,612

నిబంధనలు కఠినతరం
స్విట్జర్లాండ్‌లో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశాలు చేశారు. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడదని, రెండు మీటర్ల ఎడం కంటే తక్కువ ఉంటే ప్రజలకు జరిమానా విధించాలని నిర్ణయాలు తీసుకుంది. హైతీ, డొమనికన్‌ రిపబ్లిక్, జోర్డాన్, బుర్కి నా ఫాసోల్లోనూ కర్ఫ్యూలు అమల్లోకి వచ్చాయి. కరోనా కారణంగా పర్యాటక రం గంపై ఎక్కువగా ఆధారపడే క్యూబాలో ఇతర దేశస్తులకు ప్రవేశాన్ని 30 రోజులపాటు నిషేధించారు. ఐవరీ కోస్ట్, బుర్కినా ఫాసోలు త్వరలోనే సరిహద్దులను మూసేయనుండగా బ్రెజిల్‌ సోమవారం ఆ పని చేయనుంది. యూ రప్, ఆస్ట్రేలియా, పలు ఆసియా దేశాల నుంచి పర్యాటకుల రాకపై నిషేధం విధించింది.

వ్యాపారాలకూ దెబ్బే
స్మార్ట్‌ఫోన్‌ రవాణా ఫిబ్రవరి నెలలో కనిష్ట స్థాయికి చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ తగ్గింపు 38 శాతం తక్కువ. ఎయిర్‌ కెనడా, ఎయిర్‌ ట్రాన్స్‌సాట్‌లు ఏడు వేల మంది ఉద్యోగులను తాత్కాలికంగా ఉద్యోగాల నుంచి తొలగించింది. పారిశ్రామిక ఉత్పత్తిని గ్వాటెమాలా నిలిపివేయనుంది. 

>
మరిన్ని వార్తలు