ఇలాంటివి కూడా చోరీ చేస్తారా..!

30 Mar, 2020 15:36 IST|Sakshi

కరోనావైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మాస్కులు, శానిటైజర్లకు డిమాండ్‌ పెరిగింది. కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే ప్రతి గంటకు ఒక్కసారి శానిటైజర్‌ లేదా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని, మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో జనాలంతా మాస్కులు, శానిటైజర్ల కొనుగోలుపై పడ్డారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా  శానిటైజర్ల కొరత ఏర్పడింది.  దీన్నే ఆసరాగా చేసుకున్న కొంతమంది దళారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో  శానిటైజర్‌ బాటిళ్లను సంపాదించుకోవడం కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

కొంతమంది అధిక ధరలు ఉన్నప్పటికీ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్తున్నారు. మరికొంత మంది ఇంట్లోనే శానిటైజర్లను తయారు చేసుకుంటున్నారు. ఇక ఈ రెండు తన వల్ల కాదనుకున్న ఓ వ్యక్తి  సింపుల్‌గా ఏటీఎం సెంటర్‌లో ఉంచిన బాటిల్‌నే ఎత్తుకెళ్లాడు. ఈ శానిటైజర్‌ దొంగతనం వీడియోని  పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌ నైలా ఇనాయత్ ట్వీటర్‌లో షేర్‌ చేశారు. వీడియోలో ప్రకారం.. ఓ వ్యక్తి డబ్బులు విత్‌డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్‌కు వచ్చాడు. డబ్బులు తీసుకున్నాడు. తర్వాత అక్కడ ఉన్న శానిటైజర్‌ బాటిల్‌ను జేబులో పెట్టుకొని వెళ్లిపోయాడు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.

‘ఏటిఎంలోకి వచ్చి డబ్బులు చోరీ చేసిన వాళ్లను చూశాం కానీ.. శానిటైజర్‌ బాటిల్‌ను దొంగతనం చేయడం ఇప్పుడే చూస్తున్నా’, ‘ఏటీఎం డోర్‌ టచ్‌ చేసే ముందు శాటిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకుంటే బాగుండేది’, ‘ఇలాంటి వారి వల్ల ఆ దేశం పురోగమిస్తుంది’, ‘పాపం ఆయన కష్టాల్లో ఉన్నాడేమో..అందుకే శానిటైజర్‌ చోరీ చేశాడు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు