‘క్లాప్స్‌ ఫర్‌ బోరిస్’కు భారీ స్పందన

8 Apr, 2020 09:33 IST|Sakshi

లండన్‌ : కరోనా వైరస్‌ మహమ్మారితో బాధపడుతున్న బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ (55)ను లండన్‌ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో గత సోమవారం వైద్యులు ఆయన్ను ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. జాన్సన్‌ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆయనలో ఎలాంటి న్యుమోనియా లక్షణాలు కనిపించలేదని ప్రధాని కార్యాలయం మంగళవారం వెల్లడించింది.

కాగా, బోరిస్‌ను ఐసీయూకు తరలించారనే వార్తలు వెలువడగానే బ్రిటన్‌తో సహా యావత్‌ ప్రపంచదేశాలు ఆయనకు సంఘీభావం తెలిపారు. జోరిస్‌ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, జపాన్‌ ప్రధాని షింజో అబే, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ తదితరులు ఆకాంక్షించారు.

ఇక బ్రిటన్‌ నెటిజన్లు సైతం బోరిస్‌కు సంఘీభావం తెలిపారు. బోరిస్‌ త్వరగా కోలుకోవాలని యూకే నెటిజన్లు ‘ క్లాప్స్‌ ఫర్‌ బోరిస్‌’(#ClapForBoris)కు పిలుపునిచ్చారు. బ్రిటన్‌ ప్రధానికి సంఘీభావంగా మంగళవారం రాత్రి 8 గంటలకు చప్పట్లు కొట్టాలని విజ్ఞప్తి చేశారు. ‘రాజకీయాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరు క్లాప్స్‌ కొట్టి బోరిస్‌ వెనుక మనం ఉన్నామనే భావనను చాటుదాం’ అంటూ నెటిజన్లు యూకే ప్రజలను కోరారు. #ClapForBoris అనే హ్యాష్‌ ట్యాగ్‌ పెట్టి వేలాది మంది నెటిజన్లు ట్వీట్లు చేశారు. దీంతో #ClapForBoris అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌గా మారింది. ఇక ‘క్లాప్‌ ఫర్‌ బోరిస్‌’కు భారీ స్పందన వచ్చింది. యూకే ప్రజలంతా బోరిస్‌కు సంఘీభావం తెలుపుతూ చప్పట్లు కొట్టారు. ‘ బోరిస్‌ మీరు కచ్చితంగా  కరోనాను జయిస్తారు’, ‘కమాన్‌ బోరిస్‌.. మీ కోసం వేయిటింగ్‌’,‘ మీ వెనుక మేమంతా ఉన్నాం’ అని నెటిజన్లు బోరిస్‌కు మద్దతు తెలిపారు.

మరిన్ని వార్తలు