‘నేను చ‌నిపోతే నా పిల్ల‌లు ఇది తెలుసుకోవాలి’

30 Mar, 2020 16:17 IST|Sakshi

మెన్న‌టివ‌ర‌కూ విదేశాల నుంచి వ‌చ్చిన‌వారిపై ప్ర‌త్యేక గౌర‌వం చూపేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. విదేశాల నుంచి వ‌చ్చార‌న‌గానే గుండెలు గుభేలుమంటున్నాయి. మ‌న ప్ర‌మేయం లేకుండానే వారివైపు క‌ళ్లు అనుమానంగా చూస్తున్నాయి. మ‌రి నిజంగానే క‌రోనా సోకిన‌వారి ప‌రిస్థితి ఏంటి? వారికి వైద్య‌ప‌రీక్ష‌లు చేస్తూ నిత్యం వారిని అంటిపెట్టుకునే డాక్ట‌ర్ల ప‌రిస్థితి ఏంటి? ఈ క్ర‌మంలో ప్రాణాలు కాపాడే వైద్యులే ఆ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదైన అమెరికాలో ఓ డాక్ట‌ర్ చేసిన మెసేజ్ ప్ర‌స్తుతం విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. న్యూయార్క్‌కు చెందిన మ‌హిళా డాక్ట‌ర్ క‌రోనా వార్డులో సేవ‌లందిస్తోంది. (తీవ్ర ఒత్తిడిలో ఆమెరికా వైద్య సిబ్బంది)

ఆమె వైర‌స్ తీవ్ర‌త‌ను తెలియ‌జేస్తూ ఓ సందేశాన్నిచ్చింది. ‘నా పిల్ల‌లు చాలా చిన్న‌వారు. వారు ఈ సందేశం చ‌ద‌వ‌లేరు. నేను మెడిక‌ల్ సూట్‌లో ఉన్నందున క‌నీసం న‌న్ను గుర్తుప‌ట్టనూలేరు. ఒక‌వేళ‌ నేను కోవిడ్‌-19(క‌రోనా వైర‌స్‌) వ‌ల్ల మ‌ర‌ణించాననుకోండి. ఒక్క‌టే నేను కోరుకునేది.. వారి త‌ల్లి బ‌తికున్న‌న్నాళ్లూ ఎంతో క‌ష్ట‌ప‌డి త‌న విధులు నిర్వ‌ర్తించింద‌ని తెలుసుకోవాల‌’ని ఆశిస్తున్నానని ట్వీట్‌లో పేర్కొంది. దీనిపై నెటిజ‌న్లు స్పందిస్తూ ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు. ‘ఇది చ‌దువుతుంటే క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరుగుతున్నాయి’ అని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. కాగా అమెరికాలో ప‌రిస్థితి రోజురోజుకూ మ‌రింత దిగ‌జారిపోతోంది. న్యూయార్క్‌లో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండ‌టం అక్కడి ప్ర‌జ‌ల‌కే కాకుండా వైద్య సిబ్బందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అమెరికాలో 59,648 కరోనా కేసులతో న్యూయార్క్‌ మొదటి స్థానంలో నిలవగా, 13 వేల కేసులతో న్యూ జెర్సీ, 6వేలకు పైగా కేసులతో కాలిఫోర్నియా తదుపరి స్థానాల్లో నిలిచాయి.

>
మరిన్ని వార్తలు