కరోనా విశ్వరూపం

6 Feb, 2020 03:59 IST|Sakshi

490కి చేరిన మృతులు24 వేలకుపైగా కేసులు

బీజింగ్‌: కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. చైనాలో 31 ప్రావిన్షియల్‌ రీజియన్లలో ఇది విశ్వరూపం చూపిస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటివరకు 490 మంది మరణించారని, 24 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని చైనా ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. వ్యాధిగ్రస్తుల సంఖ్య అంతకంతకీ పెరిగిపోతూ ఉండడంతో వూహాన్‌లో జాతీయ స్టేడియం, జిమ్‌లనే తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు చైనాలో కరోనా ధాటికి బెంబేలెత్తిపోయి హాంగ్‌కాంగ్‌ వచ్చేవారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో చైనా నుంచి వచ్చిన వారిని తప్పనిసరిగా రెండు వారాల పాటు నిర్బంధంలో ఉంచుతామని హాంగ్‌కాంగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యారీ ప్రకటించారు.  

పుట్టిన పసికందుకి సోకిన వైరస్‌
చైనాలోని వూహాన్‌లో అప్పుడే పుట్టిన పసికందుకి కరోనా వైరస్‌ సోకినట్టు అధికారులు గుర్తించారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డకు ఈ వైరస్‌ సోకి ఉంటుందని భావిస్తున్నారు. ప్రసవం కావడానికి ముందు తల్లికి జరిపిన పరీక్షల్లో ఆమెకు కరోనా వైరస్‌ ఉన్నట్టు తేలింది. దీంతో బిడ్డకు గర్భంలోనే ఆ వైరస్‌ సోకి ఉంటుందని చెబుతున్నారు.  

అనుమానితుడు పరారీ: గుజరాత్‌లో కరోనా వైరస్‌ లక్షణాలున్న వ్యక్తి ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. జనవరి 19న చైనా నుంచి వచ్చిన 41 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించడంతో అతనిని వైద్య పరీక్షల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రికి తరలించారు. అయితే రక్త నమూనాలు ఇవ్వకుండా అతను పరారీ కావడం ఆందోళన రేపుతోంది.  కాగా, కరోనా వైరస్‌ నిర్మూలనకు చైనాతో కలిసికట్టుగా పోరాటం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. కరోనా వైరస్‌ ప్రభావం గుజరాత్‌లో వజ్రాల వ్యాపారాన్ని చావు దెబ్బ కొట్టనుంది. వచ్చే రెండు నెలల్లో 8 వేల కోట్ల రూపాయల నష్టం వస్తుందని మార్కెట్‌ విశ్లేషకుల అంచనా.

మరిన్ని వార్తలు