లాక్‌‘డౌన్‌’.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు

8 Apr, 2020 09:15 IST|Sakshi

వుహాన్‌: కరోనా మహమ్మారికి జన్మస్థానమైన చైనాలోని వుహాన్‌లో బుధవారం లాక్‌డౌన్‌ ఎత్తివేశారు. హుబె ప్రావిన్స్‌ రాజధాని నగరమైన వుహాన్‌లో 76 రోజుల పాటు విధించిన నిర్బంధాన్ని తొలగించారు. కోవిడ్‌-19 వెలుగు చూడటంతో 11 వారాల క్రితం లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. కొత్తగా కోవిడ్‌ కేసులు నమోదు కాకపోవడంతో నిర్బంధం తొలగించడంతో ప్రజలకు స్వేచ్ఛ లభించింది. వుహాన్‌ వాసుల ప్రయాణాలకు అనుమతి లభించిందని గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. 

లాక్‌డౌన్‌ తొలగించడంతో వుహాన్‌లో రాకపోకలు మొదలయ్యాయి. దాదాపు 55 వేల మంది బుధవారం రైళ్ల ద్వారా వుహాన్‌ నుంచి బయలు దేరతారని స్థానిక మీడియా తెలిపింది. ఆంక్షలు తొలగిపోవడంతో సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. 76 రోజుల తర్వాత దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరుచుకోవడంతో సందడి నెలకొంది. వుహాన్‌ నుంచి చైనాలోని వివిధ ప్రాంతాలకు బయలుదేరిన జనంతో ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. పాఠశాలలను మినహాయించి మిగతా అన్ని ఆంక్షలను తొలగించింది.

చైనాలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల్లో 50వేలకు పైగా వుహాన్‌లో ఉన్నాయి. వుహాన్‌లోనే 2500 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన చైనా పాలకులు జనవరి 23 నుంచి వుహాన్‌లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. కఠిన ఆంక్షలు అమలు చేయడంతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. వుహాన్‌లో మరోసారి కరోనా విజృంభించే అవకాశాలు లేవని చైనా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కరోనా భయం వీడకపోవడంతో వుహాన్‌ ప్రజలు ఇంకా మాస్క్‌లు ధరించే ప్రయాణాలు సాగిస్తున్నారు. 

చదవండి: ఈ మీటర్‌తో కరోనాను ఇట్టే గుర్తించవచ్చు!

మరిన్ని వార్తలు