ప్రపంచ వ్యాప్తంగా మరింత పెరిగిన కరోనా మరణాలు

31 Mar, 2020 10:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి బలవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని వేలాది మంది పిట్టలా రాలిపోతున్నారు. ప్రపంచంలోని సగానికిపైగా దేశాలు లాక్‌డౌన్‌లోనే ఉన్నాయి. వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినా మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 37,820 మంది కరోనా మహమ్మారికి బలైయ్యారు. ఇక కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 7.85 లక్షలు దాటింది. వైరస్‌ నిర్థారణ అయినవారిలో మంగళవారం ఉదయం నాటికి 1,65,659 మంది కోలుకున్నారు.

ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ విలయ తాండవం చేస్తోంది. అమెరికా మొత్తమ్మీద 1,64,253 మంది కరోనా వైరస్‌ బారిన పడగా.. ఇప్పటి వరకు 3,167 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే ఆ దేశంలో 568 మంది ప్రాణాలు కోల్పోయారు. వచ్చే రెండు వారాల్లో కేసులు, మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతాయని, లక్ష మంది వరకు ప్రాణాలు కోల్పోవచ్చునని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు.ఇటలీ 11,591 మంది మృత్యువాత పడ్డారు. స్పెయిన్‌లో 7,716 మంది ప్రాణాలు విడిచారు. చైనాలో 81,518 మంది కరోనా బారిన పడగా.. 3.305 మంది మృతి చెందారు. ఫ్రాన్స్‌లో 3024, ఇరాన్‌లో 2.757 మందిని కరోనా వైరస్‌ పొట్టనపెట్టుకుంది. ఇక భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 43కు చేరింది. దేశంలో ఇప్పటి వరకు 1347 మందికి కరోనా వైరస్‌ సోకింది. వీరిలో 137 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో ఇప్పటి వరకు 77 కేసు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు