అక్టోబర్‌ నాటికి వ్యాక్సిన్‌?

19 Apr, 2020 03:10 IST|Sakshi

లండన్‌: వచ్చే నెలకల్లా 500 మందిపై కోవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వ్యాక్సినోలజీ ప్రొఫెసర్‌ సారా గిల్బర్ట్‌ వెల్లడించారు. 18– 55 ఏళ్ల వారిని ఈ ప్రయోగం కోసం ఎంపిక చేసి, ప్రాథమికంగా పరీక్షిస్తారని బ్లూమ్‌బెర్గ్‌ సంస్థ తెలిపింది. 2020 అక్టోబర్‌ నాటికి అన్నీ అనుకూలిస్తే ఈ పరిశోధనల ద్వారా మంచి ఫలితాలు రావొచ్చనీ, భారీస్థాయిలో వ్యాక్సిన్‌ను తయారుచేసే సామర్థ్యా న్ని సాధిస్తామని గిల్బర్ట్‌ తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌లో 1994 నుంచి గిల్బర్ట్‌ వ్యాక్సిన్లపై అధ్యయనం చేస్తున్నారు.

నావెల్‌ కరోనా వైరస్‌కి వ్యాక్సిన్‌ పరిశోధనకు గిల్బర్ట్‌కి, బ్రిటన్‌కి చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ రీసెర్చ్, యూకే రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సంస్థలు మార్చిలో 28 లక్షల డాలర్ల గ్రాంటుగా ఇచ్చాయి. ఇమ్యునైజేషన్‌ దశ నుంచి క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు వచ్చిన ప్రయోగాల్లో గిల్బర్ట్‌ బృందం ప్రయోగం మొదటిది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్న 70 సంస్థలను గుర్తించగా, అందులో మూడు సంస్థలు ఇప్పటికే మనుషులపై ప్రయోగం చేశాయి.

గిల్బర్ట్‌ ప్రయోగం తొలిదశలో 510 మంది వలంటీర్లను ఐదు గ్రూపులుగా విభజించి వారికి వ్యాక్సిన్‌ ఇచ్చి, వారిని ఆరు నెలల పాటు పర్యవేక్షిస్తారు. తొలి ఇమ్యునైజేషన్‌ ఇచ్చిన నాలుగు వారాల అనంతరం ఈ ఐదు గ్రూపుల్లో ఒక గ్రూపు వారికి వ్యాక్సిన్‌ రెండో డోసు ఇస్తారు. వేసవి కాలంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ జరిగే తీరునిబట్టి వ్యాక్సిన్‌ పనితీరుని గుర్తిస్తారు. అదే కాలంలో ఇతర దేశాల్లోని భాగస్వాములతో కలిసి వ్యాక్సిన్‌ ఫలితాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌లు తయారుచేస్తోన్న ప్రతి ఒక్కరికీ వారి ప్రాథమిక నిర్ధారణలను, వారి ఆలోచనలను పంచుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు గిల్బర్ట్‌ లాన్సెట్‌ పత్రికకు చెప్పారు. 

మరిన్ని వార్తలు