చెత్తను పడేద్దామనుకుంటే.. భారీ జరిమానా వేశారు..!

2 Aug, 2018 18:06 IST|Sakshi
నీళ్ల సీసాలు,  స్నాక్స్‌, శాండ్‌విచ్‌ వ్యర్థాలు

లండన్‌: ఓ వైపు అంతెత్తున పేరుకుపోతున్న చెత్తను పునర్వినియోగంలోకి తెచ్చి దేశాన్ని స్వచ్ఛంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ కంటున్న కలలు ఏమేరకు సఫలమవుతాయోగానీ.. విదేశాల్లో మాత్రం స్వచ్ఛత విషయంలో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. చిన్న చిన్న తప్పిదాలకే భారీ జరిమానాలు విధించడంతో అక్కడి జనం బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఈశాన్య లండన్‌లోని చింగ్‌ఫోర్డ్‌లో అనుమతి లేకుండా చెత్తను తీసుకెళ్తున్నాడని ఓ వ్యక్తికి అటవీ శాఖ అధికారులు భారీ జరిమానా విధించారు.  

వివరాలు.. స్టివార్ట్‌ గాస్లింగ్‌ (43) గురువారం తన కారులో వెళ్తున్నాడు. ప్రయాణ సమయంలో అప్పటికే తాను వినియోగించిన స్నాక్స్‌, శాండ్‌విచ్‌ వ్యర్థాలు, వాటర్‌ బాటిల్స్‌ను డస్ట్‌బిన్‌లో వేద్దామని ఒక ప్లాస్టిక్‌ బ్యాగులో వేసి కారు వెనకాల పెట్టాడు. స్వస్థలానికి వెళ్లాక పడేద్దామనుకున్నాడు. అదే అతని జేబుకు చిల్లు పడేలా చేసింది. వాల్థాం ఫారెస్ట్‌ కౌన్సిల్‌ అధికారులు చేపట్టిన తనిఖీల్లో అతను దొరికిపోయాడు. అనుమతి లేకుండా చెత్తను తీసుకెళ్లడం నేరమంటూ గాస్లింగ్‌కు 27 వేల రూపాయల జరిమానా విధించారు. అందుబాటులో ఉన్న డస్ట్‌బిన్‌లను గమనించకుండా ఫైన్‌ కట్టిన గాస్లింగ్‌ ఊహించని షాక్‌తో బిత్తరపోయాడు.

>
మరిన్ని వార్తలు