జైషే, లష్కరే.. అల్‌కాయిదా, ఐసిస్‌!

8 Jul, 2017 01:02 IST|Sakshi
జైషే, లష్కరే.. అల్‌కాయిదా, ఐసిస్‌!

పేర్లే వేరు.. సిద్ధాంతాలొక్కటే
► వీరికి ఆశ్రయమిచ్చేవారిపై కఠిన చర్యలు
► జీ–20 సదస్సులో తేల్చిచెప్పిన మోదీ
► 11 సూత్రాలతో ‘ఉగ్ర’ కార్యాచరణ ప్రకటన


హాంబర్గ్‌: రాజకీయ లక్ష్యాలను సాధించేందుకు కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా విమర్శించారు. పాకిస్తాన్‌ పేరెత్తకుండానే జీ–20 వేదికగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న దేశాలపై కఠినంగా వ్యవహరించటంలో కూటమి దేశాలన్నీ సంయుక్తంగా పనిచేయాలన్నారు. జర్మనీలోని హాంబర్గ్‌లో జరుగుతున్న జీ–20 దేశాల సదస్సులో మోదీ ఉగ్రవాదంపై పోరాటానికి 11 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను సూచించారు.

‘సీమాంతర ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్‌ వంటి సంస్థలుకూడా పశ్చిమాసియాలో ఐసిస్, అల్‌కాయిదాలాగా, నైజీరియాలో బోకోహరాంలాగానే ప్రమాదకరమైనవి. పేర్లు వేరైనా విద్వేషం, చంపటమే ఈ సంస్థల సిద్ధాంతం’ అని మోదీ పేర్కొన్నారు. కొన్ని దేశాలు రాజకీయ లక్ష్యాలను చేరేందుకు ఉగ్రవాదాన్ని వాడుకుంటున్నాయన్నారు. ఉగ్రవాదంపై పోరులో ఇంతవరకున్న అంతర్జాతీయ స్పందన అంతంతమాత్రమేనని.. అందుకే ఉగ్ర పోరాటంలో సంయుక్త సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరముందని ప్రధాని సూచించారు.

ఆ దేశాలకు జీ–20 ప్రవేశం వద్దు!
జీ–20 దేశాలు ఉగ్రవాదుల జాబితాను ఇచ్చిపుచ్చుకోవటం, ఉగ్రవాదులను న్యాయపరమైన విచారణకోసం సభ్యదేశాలకు అప్పగించటం, వారికి అందే నిధులు, ఆయుధాల సరఫరాపై ప్రత్యేక దృష్టిపెట్టి కఠినంగా వ్యవహరించటంలాంటి 11 సూత్రాల కార్యాచరణను మోదీ సదస్సులో సూచించారు. విస్ఫోటక కార్యాచరణ దళం (ఈఏటీఎఫ్‌) ఏర్పాటు తప్పనిసరని.. దీని ద్వారా ఉగ్రవాదులకు ఆయుధాలు చేరకుండా కట్టడి చేయవచ్చని ప్రధాని వెల్లడించారు.

సైబర్‌ సెక్యూరిటీపైనా.. జీ–20 దేశాల మధ్య సహకారం పెరగాలన్నారు. ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న దేశాల ప్రతినిధులకు జీ–20లో ప్రవేశాన్ని నిషేధించాలని పేర్కొన్నారు. ‘ఈ మధ్య దేశాల మధ్య సంబంధాలు తగ్గిపోయి ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ పెరిగిపోతోంది. అందుకే అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందా(సీసీఐటీ)న్ని,  ఈ విషయంపై భద్రతామండలి సూచించిన నిబంధనలూ  త్వరగా అమల్లోకి తీసుకురావాలన్నారు.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో..
పర్యావరణ మార్పులు, పారిస్‌ ఒప్పందం విషయంలో జీ–20 దేశాలన్నీ ఏకతాటిపై సంపూర్ణ సహకారంపై నడవాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు. పారిస్‌ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికా స్పష్టం చేయటంతోపాటు ట్రంప్‌ కూడా పాల్గొన్న ఈ వేదికపై మోదీ ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.

పర్యావరణమార్పు కార్యాచరణను అమలు చేయటంలో అభివృద్ధి చెందిన దేశాలు ప్రత్యేక చొరవతీసుకోవాలని ప్రధాని సూచించారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అవసరమైన సాంకేతికత, అభివృద్ధి వ్యవస్థ, సామర్థ్య నిర్మాణం విషయంలో ఓ కూటమిని ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. ఈ విషయంలో భారత్‌ సన్నద్ధంగా ఉందన్నారు. నైపుణ్య భారత్, డిజిటల్‌ ఇండియా, ఆర్థిక ఏకీకరణ వంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో భారత్‌ ముందుకెళ్తోందని తెలిపారు.

బ్రిక్స్‌ సదస్సులోనూ..
అంతకుముందు జరిగిన బ్రిక్స్‌ సమావేశంలోనూ ఉగ్రవాదంతోపాటుగా అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మాట్లాడారు. ఉగ్రవాదంపై పోరాటంలో మిగిలిన ప్రపంచాన్ని బ్రిక్స్‌ సమాజం ముందుండి నడిపించాలని కోరారు. ‘ఉగ్రవాదంపై బ్రిక్స్‌ మొదట్నుంచీ బలమైన వాదన వినిపిస్తోంది. ఈ పోరాటానికీ బ్రిక్స్‌ దేశాలే నాయకత్వం వహించాలి’ అని మోదీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు బ్రిక్స్‌ కూటమితోపాటుగా జీ–20 దేశాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు.

వాణిజ్యంతోపాటుగా పలు అంశాల్లో ఈ కూటమి దేశాలమధ్య సహకారం మరింత పెరగాలని అభిలషించారు. భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను (జీఎస్టీ) గురించీ మోదీ వివరించారు. పారిస్‌ ఒప్పందం అమలు విషయంలో భారత్‌ చిత్తశుద్ధితో ఉందని బ్రిక్స్‌దేశాలకు మోదీ తెలిపారు. బ్రిక్స్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఏర్పాటువిషయంలోనూ సభ్యదేశాలు చొరవతీసుకోవాలని కూడా మోదీ సూచించారు.

‘అంతర్జాతీయ వేదికపై స్థిరత్వం, సంస్కరణలు, అభివృద్ధి, పాలన విషయంలో బ్రిక్స్‌ దేశాలు ఒకే మాటపై ఉన్నాయి. మనం తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని ప్రభావితం చేయాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తిరిగి స్థిరత్వం రావటంలో మనమంతా కృషిచేయాలి’ అని ప్రధాని తెలిపారు. అదృష్టవశాత్తూ భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. గల్ఫ్, పశ్చిమాసియా, కొరియా ద్వీపకల్పంలో నెలకొన్న భౌగోళిక రాజకీయాలపైనా మోదీ బ్రిక్స్‌ సదస్సులో ఆందోళన వ్యక్తం చేశారు.  
 

మరిన్ని వార్తలు