చైనీస్‌ ఫుడ్‌లో పన్ను.. షాక్‌!

31 Oct, 2019 11:48 IST|Sakshi

ఏదైనా తింటుంటే పంటికింద రాయి వస్తేనే కలుక్కుమంటుంది. అలాంటిది తినే సమయంలో పంటి కింద పన్ను తగిలితే.. ఆహారంలో ఏకంగా మానవదంతం కనిపిస్తే.. ఆ ఫుడ్‌ను చూస్తేనే అసహ్యం కలుగుతుంది. తినాలనిపించదు. అచ్చం ఇలాంటి అనుభవం ఈ బ్రిటన్‌ జంటకు ఎదురైంది. డేవ్‌ బరోస్‌, అతని ప్రియురాలు స్టెఫానీ మెక్‌డొనౌగ్‌ వర్సెస్టెర్‌షైర్‌లోని ఓ చైనీస్‌ రెస్టారెంట్‌లో ఫుడ్‌ పార్శల్‌ తీసుకొని ఇంటికి వెళ్లారు. పోర్క్‌ (పంది మాంసం)తో తయారుచేసిన చైనీస్‌ ఫుడ్‌ మంచి రుచిగా ఉంటుంది లాగించేద్దామనుకున్నారు. కానీ ఫుడ్‌ తింటుంటే వాళ్లకు చిన్నపాటి వింత వస్తువు దర్శనమిచ్చింది.

దానిని తేరిపారా చూస్తే.. అది మానవదంతం అని తేలింది. అది కొంపదీసి తమ పన్ను కాదు కదా! అని వారు మొదట భయపడ్డారు. ఫుడ్‌ తింటుంటే తమ పన్ను ఊడలేదని నిర్ధారించుకున్న తర్వాత వెంటనే రెస్టారెంట్‌కు ఫోన్‌ చేసి.. ఇదేందయ్యా.. చైనీస్‌ ఫుడ్‌లో పన్ను కూడా పంపించావని ప్రశ్నించారు. దానికి.. అది పన్ను అయి ఉండదని, పోర్క్‌ ఎముక ముక్కో, ఉల్లిగడ్డ ముక్కో అయి ఉంటుందని మేనేజర్‌ బుకాయించాడు. దీంతో ‘వర్సెస్టెర్‌లోని న్యూటౌన్‌ చెనీస్‌ రెస్టారెంట్‌ ఫుడ్‌ను ఎవరూ వాడకండి. వారి ఫుడ్‌లో పన్ను వచ్చింది. ఇదేంటని అడిగితే అది పన్ను కాదు ఎముక, లేదా ఉల్లిగడ్డ ముక్క అంటూ బుకాయిస్తున్నారు. ఇదిగో చూడండి ఫుడ్‌లో పన్ను ఫొటోలు’అంటూ స్టెఫానీ పోస్ట్‌ చేసింది. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు