వెయ్యి డాలర్ల విలువైన మద్యం చోరీ

11 Mar, 2020 14:36 IST|Sakshi

లూసియానా: దొంగలు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లడం చూశాం.. కానీ ఓ జంట ఏకంగా బీర్‌ కేసులనే దొంగిలించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఈ దంపతులను అరెస్ట్‌ చేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని లూసియానాలో మాత్యూ ఫోర్బ్స్‌, అష్లే ఫోర్బ్స్‌ దంపతులు మద్యానికి బానిసయ్యారు. ఈ క్రమంలో షాపుల్లో చొరబడి మద్యాన్ని ఎత్తుకెళ్లేవారు. వీరి నిర్వాకం గురించి తెలిసిన కొన్ని సంస్థలు తమ దుకాణాల్లో వారి ప్రవేశాన్ని నిషేధించాయి. అయినప్పటికీ వారు తీరు మార్చుకోలేదు. ఎంతో చాకచక్యంగా షాపుల్లో దూరి కావాల్సిన బీర్‌ క్యాన్‌లను ఎంపిక చేసుకుంటారు. అనంతరం ఎవరూ వాళ్లను గమనించట్లేదని నిర్ధారించుకోగానే వాటిని తస్కరిస్తారు. ఎలాంటి బిల్లు కట్టకుండా వాటితో  పరారయ్యేవారు.

తాజాగా మాత్యూ ఫోర్బ్స్‌ ఇదే సూత్రాన్ని ఫాలో అయి బీర్‌ బాటిళ్లు ఎత్తుకుపోయే ప్రయత్నం చేయగా అది అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. మరో షాపులో వస్తువులతో సహా ఉడాయించేందుకు సమాయత్తమవుతున్న అతని భార్య అష్లేను సైతం పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఇరువురిని జైలుకు తరలించి విచారణ చేపట్టారు. కాగా ఇప్పటివరకు ఈ జంట వెయ్యి డాలర్లకు పైగా (సుమారు రూ.73 వేల) విలువైన మద్యాన్ని చోరీ చేయడం గమనార్హం. అష్లేపై గతంలో మాదక ద్రవ్యాల కేసు కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు