నటి మీరాకు అరెస్ట్ వారెంట్

31 Jul, 2015 20:52 IST|Sakshi
నటి మీరాకు అరెస్ట్ వారెంట్

లాహోర్: ఆమె అసలు పేరు ఇర్తిజా రూబాబ్  చాలా మందికి తెలియకపోవచ్చు. మీరా అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. సినిమాలు, నాటకరంగం, టీవీ.. ఇలా అన్ని మాధ్యమాల్లోనూ అభినయించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను ఏర్పర్చుకున్న పాకిస్థానీ నటి మీరా ప్రస్తుతం కష్టాల్లో చిక్కుకుంది. లాహోర్ కోర్టు శుక్రవారం ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేసింది. ఇంతకూ ఆమె చేసిన నేరం ఏమంటే..

కొన్నేళ్ల కిందట కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే మీరా.. అతీఖుర్ రహమాన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. అయితే గత కొద్దికాలంగా వారిద్దరికీ పొసగడంలేదు. దీంతో వేరుగా ఉంటున్నారు. ఈలోపే వేరొక వ్యక్తిని రెండోపెళ్లి చేసుకుంది. మీరా నిర్ణయానికి ఖిన్నుడైన మొదటి భర్త .. తనకు విడాకుటు ఇవ్వకుండానే మీరా వేరొక వ్యక్తిరిని పెళ్లాడటం నేరమని, అందుకుగానూ ఆమెను తగినవిధంగా శిక్షించాలని కోర్టులో దావావేశాడు.

పిటిషన్ను స్వీకరించిన లాహోర్ స్థానిక కోర్టు విచారణకు హాజరుకావలసిందిగా గత నెలలో మీరాకు నోటీసులు పంపింది. మీరా మాత్రం ఆ నోటీసులను పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి మీరాను అదుపులోకి తీసుకోవాల్సిందిగా నాన్ బెయిలబుల్ అరెస్టువారెంట్ జారీచేశారు. సెప్టెంబర్ 17లోగా తన ముందు మీరాను హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారు. ఈ తరం వారిలో బాలీవుడ్ లో నటించిన మొట్టమొదటి పాకిస్థానీ నటి మీరాయే కావడం విశేషం. 2005లో ఆమె నటించిన 'నజర్' సినిమా అనేక సంచలనాలు సృష్టించింది.

మరిన్ని వార్తలు