అరవై ఏళ్ల టీనేజర్‌...

15 Mar, 2020 02:16 IST|Sakshi

జపాన్‌ డైమండ్‌ ప్రిన్సెస్‌ క్రూయిజ్‌ షిప్‌లో ప్రయాణించిన ఓ దంపతుల వింత గాథ ఇది. ఆ నౌకలో ప్రయాణికులకి సోకిన కరోనా వైరస్‌ అందరినీ ఎంత ఆందోళనకు గురిచేసిందో తెలిసిందే కదా. అమెరికాలో కాలిఫోర్నియా లోకల్‌ స్టేషన్‌ యజమాని అయిన కార్ల్‌ గూడ్‌మ్యాన్‌ తన భార్య జెరి సెరాట్టి పుట్టినరోజు కానుకగా డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో ఆగ్నేయాసియా చుట్టి రావాలని టిక్కెట్లు బుక్‌ చేశారు. ఆయన వయసు అరవైకి పై మాటే. జనవరి నెలాఖరున ఆ నౌకలో బయల్దేరిన వాళ్లు కొద్ది రోజులు ప్రయాణం చేశారో లేదో కరోనా మహమ్మారి పడగ విప్పిందని తెలిసింది. ఆ నౌకని జపాన్‌ రేవుకి తీసుకువచ్చి వదిలేశారు. రెండువారాలు అంతా ఆ నౌకలోనే ఉన్నారు. వారిద్దరికీ ఆ నౌకలో బాల్కనీ ఉన్న గది వచ్చింది. ఆ అనుభవాలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు గూడ్‌మ్యాన్‌.

‘‘ఒక్కొక్కరికి కరోనా వైరస్‌ సోకుతూ ఉంటే వారిని చికిత్సా కేంద్రాలకు తరలిస్తున్నారు. మేమిద్దరమే మా గదిలో ఉన్నాం. రోజుకి మూడుసార్లు మాత్రమే బయటకు రానిచ్చేవారు. సముద్రం ఒడ్డున బాగా ఎంజాయ్‌ చేశాం. కానీ ఏదో మూల భయం ఉండనే ఉన్నాయి. అయినా సరే ఆ నిర్బంధంలో కూడా స్వేచ్ఛగా పక్షి పిల్లల్లా ఎగిరాం. చివరికి ఆ నౌకలో వాలెంటైన్స్‌ డే కూడా జరుపుకోవడం అందమైన అనుభూతి’’అని పోస్టు చేశారు. అయితే అమెరికా విమానం వచ్చి వారిని తీసుకువెళుతున్న సమయంలో గూడ్‌మ్యాన్‌ అస్వస్థతకి లోనయ్యారు.

జ్వరం, దగ్గు మొదలైంది. అమెరికాలో ఒమాహా చేరాక వైద్య పరీక్షల్లో ఆయనకి కరోనా వైరస్‌ సోకిందని తేలింది. ఆయన భార్య జెరి మాత్రం బాగానే ఉన్నారు. అందుకే ఇద్దరినీ వేర్వేరు చోట ఉంచారు. 14 రోజుల తర్వాత జెరినీ ఇంటికి పంపించారు. గూడ్‌మ్యాన్‌ ఇంకా చికిత్సలోనే ఉన్నారు. వైరస్‌ అదుపులోనికి రాకపోవడంతో ఆయన ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. నెలరో జులుపైనే అయింది ఆయన బయట ప్రపంచం చూసి. అయితేనేం భార్యతో కలిసి ఆ నౌకలో గడిపిన మధురానుభూతుల్ని నెమరువేసుకుంటూ కాలం గడిపేస్తున్నానని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
 

మరిన్ని వార్తలు