కోటికి చేరుకున్న కరోనా కేసులు

28 Jun, 2020 04:13 IST|Sakshi

ప్రపంచంపై కరోనా పడగ 

5 లక్షలకు చేరువలో మరణాలు

కంటికి కనిపించని సూక్ష్మ క్రిమి చైనాలో వూహాన్‌లో పుట్టి యూరప్‌ దేశాల మీదుగా విస్తరించి అమెరికాలో ఉగ్రరూపం దాల్చి భారత్‌ని కూడా భయపెడుతోంది.   6 నెలలు, 213 దేశాలు.. కోటి కేసులు, దాదాపు 5 లక్షల మృతులు.. ఇదీ కోవిడ్‌19 సృష్టిస్తున్న అల్లకల్లోలం.


వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: ఒక వైరస్‌ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఒక వైరస్‌ అందరికీ కొత్త పాఠాలు నేర్పిస్తోంది. ప్రపంచానికి తాళం వేసి ఆర్థికంగా అతలాకుతలం చేస్తోంది. 2019 డిసెంబర్‌ 31న సార్స్‌ తరహా వైరస్‌ కేసులు చైనాలోని వూహాన్‌లో వెలుగులోకి వస్తున్నాయని అందరికీ తెలిసినప్పుడు ఇదేదో మామూలు వైరస్‌ అనుకున్నారు. అంతకంతకూ ఆ వైరస్‌ శరవేగంగా విస్తరించింది. అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికింది. తొలి రెండు, మూడు నెలలు చైనాలోని వూహాన్‌తో పాటుగా అమెరికా, ఇటలీ, స్పెయిన్, యూకే దేశాలు అల్లాడిపోయాయి. ఆ తర్వాత యూరప్‌లో కొన్ని దేశాలు కోలుకున్నప్పటికీ అమెరికాను కేసుల భయం వెంటాడుతూనే ఉంది. శనివారం రాత్రికి ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,00,00,418కు, బాధితుల మరణాల సంఖ్య 4,98,952కు చేరాయి.

కరోనాతో వణుకుతున్న దేశాలు
అగ్రరాజ్యం అమెరికాని కరోనా అసాధారణ రీతిలో కాటేసింది. 25 లక్షలకు పైగా కేసులు లక్షా 25 వేలకు పైగా మృతులతో ఆ దేశం అగ్రభాగంలో ఉంది. ఇప్పటికీ అమెరికాలో రోజుకి సగటున 40 వేల మందికి కోవిడ్‌ –19 సోకుతోంది. బ్రెజిల్, రష్యా, భారత్, ఇరాన్, మెక్సికో, చిలీ, పెరూ, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ , ఇండోనేసియా దేశాల్లోనూ కరోనా కేసులు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. న్యూజిలాండ్‌ సహా 15 దేశాలు ఇప్పటివరకు కరోనాని జయించామని చెప్పుకుంటున్నప్పటికీ మళ్లీ ఆయా దేశాల్లో రాదని చెప్పలేని పరిస్థితి. చైనాని కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ భయపెడుతోంది.  

ప్రాణాపాయం లేదు
కరోనా వైరస్‌ విస్తరణ దడ పుట్టించేలా ఉన్నప్పటికీ, వేరే ఇతర వ్యాధులు ఉన్నవారికే ఇది అత్యంత ప్రమాదకరం. మిగిలిన వారికి కేవలం ఇదొక ఫ్లూ లాంటి జ్వరం మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. కొన్ని ముందు జాగ్రత్త చర్యలతో ఈ వైరస్‌ను అరికట్టవచ్చునని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ అంచనాల ప్రకారం మొత్తం కేసుల్లో ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే వ్యాధి అదుపులోకి వచ్చే కేసులు 80% వరకు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరినా కోలుకున్న కేసులు 15 శాతం ఉంటే, వాటిలో విషమంగా మారిన కేసులు 5శాతం. ఆ 5శాతం కేసుల్లోనూ సగం మందికే ప్రాణాలకు ముప్పు ఉంటోంది.Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు