ఫుడ్‌ బ్యాంక్స్‌ వద్ద జనం క్యూ

20 Apr, 2020 03:40 IST|Sakshi
కాలిఫోర్నియాలో ఫుడ్‌ బ్యాంక్‌ వద్ద బారులు తీరిన కార్లు

అమెరికాలో దారుణ పరిస్థితులు

కరోనాకు చైనాయే కారణమని తేలితే తీవ్ర పరిణామాలు: ట్రంప్‌

వూహాన్‌ ల్యాబ్‌ నుంచి వైరస్‌ రాలేదు: చైనా

వాషింగ్టన్‌/బీజింగ్‌: అమెరికాలో కోవిడ్‌–19 ధాటికి ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. 2 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవడంతో మూడు పూటలా గడవని పరిస్థితులు వచ్చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఉచితంగా అందించే ఫుడ్‌ బ్యాంకుల ఎదుట అమెరికన్లు క్యూలు కడుతున్నారు. న్యూ ఓర్లాన్సీ నుంచి డెట్రాయిట్‌ వరకు ఇదే పరిస్థితి. ఇలా ఫుడ్‌ బ్యాంకుల దగ్గరకి వెళ్లడం చాలా మందికి ఇదే మొదటిసారి. పెన్సిల్వేనియాలో ఒక ఫుడ్‌ సెంటర్‌ దగ్గర ఏకంగా వెయ్యి కార్లు క్యూలో ఉన్నాయంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓహియోలో రాత్రికి రాత్రి ఫుడ్‌ సెంటర్లలో 30 శాతం డిమాండ్‌ పెరిగిపోయింది. తమ వంతు రావడానికి గంటలు గంటలు సమయం పడుతోంది.

చైనాని హెచ్చరించిన ట్రంప్‌
కరోనా వైరస్‌ పుట్టుక, వ్యాప్తి అంశంలో చైనాపై ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ దేశంపై మరోసారి విరుచుకుపడ్డారు. కరోనా వ్యాప్తికి కారణం చైనాయేనని తేలితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ‘‘వైరస్‌ వ్యాప్తి గురించి చైనా తెలిసి కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించిందని వెల్లడైతే తేలిగ్గా తీసుకోం. 1917 తర్వాత ఈ స్థాయిలో ప్రాణనష్టం చూడలేదు. పరిణామాలన్నీ చాలా తీవ్రంగా ఉంటాయి’’అని హెచ్చరించారు. ఈ సంక్షోభ సమయంలో చైనా కోవిడ్‌పై పారదర్శకంగా లేకపోవడం, మొదట్లో అమెరికా అందించిన సాయాన్ని స్వీకరించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ వైరస్‌ భయోత్పాతం సృష్టిస్తుందని వాళ్లకి ముందే తెలుసునని అందుకే అమెరికా సాయం చేస్తానన్నా అంగీకరించలేదని ట్రంప్‌ గుర్తు చేశారు. ఇక మరణాల సంఖ్య విషయంలో కూడా చైనా నిజాలు దాస్తోందని ట్రంప్‌ ఆరోపించారు. అమెరికా కంటే కూడా చైనాలోనే మృతుల సంఖ్య ఎక్కువ ఉండి ఉంటుందని అన్నారు. డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ముందున్న జో బిడెన్‌కు చైనా మద్దతు ఉందని ట్రంప్‌ ఆరోపించారు. బిడెన్‌ విజయం సాధిస్తే అమెరికాను చైనా ఆక్రమించుకుంటుందని జోస్యం చెప్పారు. బిడెన్‌ వాణిజ్య విధానాల వల్ల ప్రజలకి ఒరిగేదేమీ ఉండదన్నారు.

► స్పెయిన్‌లో కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పడుతోంది. ఆదివారం 410 మంది మరణించారు. నెల రోజులుగా నమోదైన మృతుల్లో ఇదే అత్యంత తక్కువ. కరోనా వైరస్‌ రావడానికి ముందు ప్రపంచయాత్రకి బయల్దేరిన కోస్తా డెలిజియోసా అనే నౌక స్పెయిన్‌లోని బార్సిలోనాకు చేరుకోనుంది. 1831 మంది ప్రయాణికులతో ఉన్న ఈ నౌక 15 వారాలు ప్రపంచ యాత్ర చేసింది. అందులో ప్రయాణికులెవరికీ వైరస్‌ సోకలేదని నౌకని నడిపిన కంపెనీ అధికారులు ఉన్నారు.  

► రష్యాలో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. 24 గంటల్లో 6,060 కేసులు నమోదయ్యాయి.  

► బ్రిటన్‌లో కరోనాతో ఇప్పటివరకు 15 వేల మందికి పైగా మృతి చెందారు.

వైరస్‌ ల్యాబ్‌ నుంచి రాలేదు: వూహాన్‌ ల్యాబ్‌ చీఫ్‌
చైనాలోని వూహాన్‌లో వైరాలజీ ల్యాబరెటరీ నుంచే కరోనా వైరస్‌ బయటకు వచ్చిందని అమెరికా చేస్తున్న ఆరోపణల్ని వూహాన్‌ వైరాలజీ ల్యాబ్‌ చీఫ్‌ తోసిపుచ్చారు. కరోనా వైరస్‌ బట్టబయలు అయ్యాక తొలిసారిగా ల్యాబ్‌ డైరెక్టర్‌ యాన్‌ జిమింగ్‌ ఆదివారం మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ఈ ల్యాబ్‌లో ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయో, ఎంత గట్టి భద్రత ఉందో మాకే తెలుసు. ల్యాబ్‌లోంచి వైరస్‌ బయటకు వచ్చే అవకాశం లేదు’’అని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ల్యాబ్‌ నుంచి వైరస్‌ వచ్చిందంటూ మాటలు విసిరి ప్రజల్ని తప్పుదోవ పట్టించదం దురదృష్టకరమని యాన్‌ అన్నారు. మరోవైపు వూహాన్‌లో వైరస్‌ అత్యంత తక్కువ ప్రమాదకరంగా ఉందని చైనా ప్రభుత్వం ప్రకటించింది.

మరిన్ని వార్తలు