విస్తృత ప్రయోగ దశకు కరోనా టీకా

23 May, 2020 05:03 IST|Sakshi

పదివేల మందిపై త్వరలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రయోగాలు

లండన్‌: కరోనా వైరస్‌పై పోరులో లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ కీలకమైన ముందడుగు వేసింది. వైరస్‌ను నివారించే టీకాను పదివేల మందిపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ఈ టీకా కరోనా శరీరంలోకి చేరకుండా అడ్డుకుంటుందా? లేదా? అన్నది పరిశీలించనుంది. గత నెలలో వెయ్యిమందిపై జరిగిన ప్రయోగాలు టీకా సురక్షితమైందని స్పష్టం చేయగా.. దాని సమర్థతను పరీక్షించేందుకు బ్రిటన్‌లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వృద్ధులతో కలిపి 10,260 మందికి టీకా వేయనున్నామని శుక్రవారం ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. 

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చైనా, అమెరికా, యూరప్‌లలో  12 వరకూ టీకాలు వేర్వేరు అభివృద్ధి దశల్లో ఉన్నాయి. ఇంత వేగంగా ఓ వ్యాక్సీన్‌ను తయారు చేయడం ఇదే మొదటిసారి. అయినప్పటికీ ఈ టీకాలు అన్ని ప్రయోగ దశలు దాటుకుని సురక్షితంగా, సమర్థంగా వైరస్‌ను అడ్డుకుంటాయా అన్నది ఇప్పటికీ అస్పష్టమే. ప్రయోగాత్మక టీకాల్లో అధికం రోగ నిరోధక శక్తిని చైతన్యవంతం చేసి వైరస్‌ను గుర్తించి మట్టుబెట్టేలా చేసేవే. ఆక్స్‌ఫర్డ్‌  టీకానే తీసుకుంటే ఇది నిరపాయకరమైన వైరస్‌తో తయారవుతోంది. చింపాంజీలకు జలుబు తెప్పించే వైరస్‌. ఇందులో కొన్ని మార్పులు చేయడం వల్ల ఇది వ్యాప్తి చెందదు.

మరిన్ని వార్తలు