కరోనా : 7లక్షలకి చేరువలో కేసులు

30 Mar, 2020 04:43 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా 32వేలు దాటిన మృతులు 

యూరప్‌లో మరణ మృదంగం

కరోనాతో కన్నుమూసిన స్పెయిన్‌ యువరాణి

వాషింగ్టన్‌/రోమ్‌/మాడ్రిడ్‌/పారిస్‌: కరోనా కోరల్లో చిక్కుకొని యూరప్‌ దేశాలు అతలాకుతలమైపోతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అక్కడ దేశాలు ఘోర కలిని ఎదుర్కొంటూ ఉండడంతో దిక్కు తోచని పరిస్థితుల్లో పడిపోయాయి. కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న ఇటలీ, స్పెయిన్‌ తమకు సాయం చేయాలంటూ యూరోపియన్‌ యూనియన్‌ దేశాలను అభ్యర్థించాయి. ప్రపంచవ్యాప్తంగా 32 వేల మందికి పైగా మరణిస్తే అందులో సగానికి పైగా ఇటలీ, స్పెయిన్‌లో నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు 7 లక్షలకి చేరువలో ఉన్నాయి అయితే అన్ని దేశాల్లోనూ సరిపడినన్ని టెస్టింగ్‌ కిట్‌లు లేకపోవడంతో వ్యాధిగ్రస్తులు ఇంకా ఎక్కువ ఉంటారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇటలీలో సూపర్‌ మార్కెట్లు లూటీ !
కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న ఇటలీలోని సిసిలీలో జనం తిండి కోసం సూపర్‌ మార్కెట్లను లూటీ చేస్తున్నారు. ‘మా దగ్గర డబ్బుల్లేవు. కడుపు నింపుకోవాలి కదా’’అంటూ బిల్లు చెల్లించకుండానే పరుగులు తీస్తున్నట్టు స్థానిక పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. దీంతో పోలీసులు తుపాకులతో మార్కెట్లను పహారా కాయాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. మృతుల సంఖ్య పదివేలు దాటిపోవడంతో వారిని పూడ్చడానికి శవపేటికలు లేక వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.  

సాయం చేయాలంటూ అభ్యర్థన
ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌ మరో ఆరు దేశాలు తమను ఆదుకోవాలంటూ యూరోపియన్‌ యూనియన్‌ని అభ్యర్థిస్తున్నాయి. 27 దేశాలతో కూడిన ఈయూ ఏర్పడిన తర్వాత ఇంతటి సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ఆర్థిక ఇబ్బందుల్ని అన్ని దేశాలు పంచుకోవాలని ఇటలీ, స్పెయిన్‌లు మొరపెట్టుకుంటే జర్మనీ, నెదర్లాండ్స్‌ వంటి దేశాలు మాస్క్‌లు, శానిటైజర్లు కూడా ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.

స్పెయిన్‌లో రికార్డు స్థాయిలో మరణాలు  
ఒకే రోజులో స్పెయిన్‌లో 838 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 6,528కి చేరుకుంది. ఇక కేసులు 78,797కి చేరుకున్నాయి.  కరోనా పంజా విసిరిన దేశాల్లో ఇటలీ తర్వాత స్థానం స్పెయిన్‌దే.

స్పెయిన్‌ యువరాణి మృతి
స్పెయిన్‌ దేశ యువరాణి మేరీ థెరెసా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. యూరప్‌లో రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి మరణించడం ఇదే మొదటిసారి. ఆమె సోదరుడు ప్రిన్స్‌ సిక్సో›్ట ఎన్‌రిక్‌ డి బార్బన్‌ ఫేస్‌బుక్‌ ద్వారా యువరాణి ఇక లేరన్న విషయం వెల్లడించారు. కరోనా సోకక ముందు నుంచి మేరీ న్యుమోనియాతో బాధపడుతున్నారు.  

నాడు స్పానిష్‌ ఫ్లూను చూసిన మహిళ...
లండన్‌: రెండు ప్రపంచయుద్ధాలకు సాక్షిగా, స్పానిష్‌ ఫ్లూను సైతం తట్టుకుని నిలిచిన ఆమె..కరోనా ముందు ఓడిపోయారు. కరోనా వైరస్‌ బారినపడి బ్రిటన్‌కు చెందిన హిల్డా చర్చిల్‌(108) శనివారం కన్నుమూశారు. ఏప్రిల్‌ 5వ తేదీన 108వ పుట్టినరోజు జరుపుకోనున్న ఆమె ఇటీవల అస్వస్థతతకు గురయ్యారు.   పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఫలితం వెలువడిన 24 గంటల్లోనే సల్‌ఫోర్డ్‌సిటీలోని వృద్ధాశ్రమంలో హిల్డా కన్నుమూశారు. కరోనాతో బ్రిటన్‌లో మృతి చెందిన కురు వృద్ధురాలు హిల్డాయేనని అధికారులు అంటున్నారు.  1918లో ప్రపంచాన్ని స్పానిష్‌ ఫ్లూ చుట్టుముట్టిన సమయంలో హిల్డా వయస్సు సుమారు ఆరేళ్లు. స్పానిష్‌ఫ్లూ నుంచి అప్పట్లో హిల్డా కోలుకుంది.

క్వారంటైన్‌లో న్యూయార్క్‌
అగ్రరాజ్యం అమెరికా కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతోంది. ఇన్నాళ్లూ న్యూయార్క్, కాలిఫోర్నియాలను అతలాకుతలం చేసిన వైరస్‌ ఇప్పుడు డెట్రాయిట్, న్యూ ఓర్లీన్స్, చికాగోల్లో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. న్యూయార్క్‌ నగరవాసులెవరూ ఇల్లు కదిలి బయటకు వెళ్లొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్షా 20 వేలకు పైగా కేసులు నమోదైతే, మృతుల సంఖ్య 2 వేలు దాటిపోయింది. కరోనాపై విజయం సాధించడానికి ఇంకా వారాలకి వారాలు పడుతుందని న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో అన్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఒకరికొకరు ఆరు అడుగులు దూరంగా ఉండాలని, దగ్గు, జలుబు ఉంటే 23 నుంచి 27 అడుగుల దూరం పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.  దక్షిణాఫ్రికాలో రోడ్లపైకి కూడా వచ్చే సరిస్థితి లేదు. రష్యా దేశ సరిహద్దుల్ని మూసేయాలని నిర్ణయించింది. వియత్నాంలో రెస్టారెంట్లు, వాణిజ్య కేంద్రాలు మూసివేశారు.

>
మరిన్ని వార్తలు