చైనా తర్వాత ఇరాన్‌..

3 Mar, 2020 02:33 IST|Sakshi

కోవిడ్‌తో 66 మంది మృత్యువాత

ప్రపంచవ్యాప్తంగా మృతులు 3 వేలు.. ఒక్క చైనాలోనే 2,900

న్యూఢిల్లీ/బీజింగ్‌/వాషింగ్టన్‌/టెహ్రాన్‌: కోవిడ్‌ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మెల్లగా విస్తరిస్తోంది. ప్రభుత్వాల్లో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటి వరకు 70 దేశాల్లోని 88వేల మందికి ఈ వ్యాధి పాకింది. చైనాలో ఈ వైరస్‌తో 2,900 మంది మృత్యువాతపడగా అన్ని దేశాల్లో కలిపి 3 వేల మంది వరకు చనిపోయారు. చైనా వెలుపల అత్యధికంగా ఇరాన్‌లో 66 మంది కోవిడ్‌తో మృతి చెందడం, మరో 1,500 మందికి వ్యాధి నిర్ధారణయినట్లు ఆ దేశం ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లోనూ కొత్తగా రెండు కోవిడ్‌ కేసులు బయటపడ్డాయి.  

చైనా తర్వాత ఇరాన్‌..
చైనాలో సోమవారం కోవిడ్‌తో 42 మంది మృతి చెందగా మొత్తం బలైనవారి సంఖ్య 2,912కు చేరుకుంది. మరో 80 వేల మంది ఈ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. దేశంలో జనవరి 22వ తేదీ తర్వాత కొత్తగా బయటపడుతున్న కేసులు తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే విషయమని చైనా ప్రభుత్వం పేర్కొంది. ఈ వైరస్‌ మొదటిగా బయటపడిన చైనా తర్వాత అత్యధికంగా ఇరాన్‌లో మరణాలు నమోదయ్యాయి. ‘సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ సలహాదారు మిర్‌మొహమ్మదీ(71) సహా 66 మంది ఈ వ్యాధితో చనిపోయారు. మరో 1,501 మందిలో వైరస్‌ లక్షణాలను గుర్తించాం’ అని ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, చైనా అధికారులు తీసుకున్న కరోనా నియంత్రణ  చర్యల కారణంగా ఆ దేశంలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిందని నాసా,  యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ తెలిపాయి. మరో ఘటనలో..యున్నాన్‌ ప్రావిన్సులో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు అధికారులను పొడిచి చంపిన ఓ వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధించింది. గత నెల 6న ఈ ఘటన జరిగింది.

మరిన్ని వార్తలు