వీకెండ్‌ ఎంజాయ్‌మెంట్‌

4 May, 2020 04:09 IST|Sakshi

చైనా, స్పెయిన్‌లలో మొదలైన సందడి

రష్యా, బ్రిటన్‌లలో పెరుగుతున్న కరోనా కేసులు  

వాషింగ్టన్‌/లండన్‌/మాస్కో/రోమ్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతూ ఉండడంతో అమెరికా నుంచి ఆసియా వరకు చాలా దేశాలు లాక్‌డౌన్‌లను దశల వారీగా ఎత్తేస్తున్నాయి. ఇన్నాళ్లూ నాలుగ్గోడల మధ్య ఉండిపోయిన ప్రజలు బయట గాలిని పీల్చుకుంటున్నారు. చైనాలో వీకెండ్‌ హాలిడేస్‌లో పార్కులు, టూరిస్టు ప్రాంతాలకు జనం వెల్లువెత్తారు. శని, ఆదివారాల్లో చైనాలో పర్యాటక కేంద్రాలను పది లక్షల మంది వరకు సందర్శించినట్టు ఒక అంచనా. స్పెయిన్‌లో కూడా ఈ వీకెండ్‌ సందడి వాతావరణం కనిపించింది.

బంధుమిత్రులతో కలిసి తమకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లిన వారంతా ఇన్నాళ్లూ పడిన ఒత్తిడి నుంచి తేరుకున్నట్టు కనిపించారు. ఇటలీలో కూడా ఆంక్షలు చాలా వరకు సడలించడంతో రోడ్లపైకి ప్రజలు వచ్చి ఆనందంగా అందరితోనూ మాట్లాడుతూ కనిపించారు. సోమవారం నుంచి పార్కులు, పబ్లిక్‌ గార్డెన్లు, బైక్‌ రైడింగ్‌లకు అనుమతి ఇవ్వడంతో ప్రజలంతా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రతీ ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ మాస్కులతోనే కనిపించారు.  

అమెరికాలోనూ తెరుచుకున్న పార్కులు  
అమెరికాలో కోవిడ్‌తో అతలాకుతలమైన న్యూయార్క్, న్యూజెర్సీలలో పార్కులు తెరుచుకున్నప్పటికీ ప్రతీ చోటా సాధారణంగా వచ్చే ప్రజల్లో 50శాతం మంది మాత్రమే రావాల్సిందిగా అనుమతులిచ్చారు.  ఇక వాషింగ్టన్‌లో సోమవారం నుంచి సెనేట్‌ ప్రారంభం కానుంది. రిపబ్లికన్‌ పార్టీకి మెజార్టీ ఉన్న సెనేట్‌ తెరుచుకుంటూ ఉంటే, డెమొక్రాట్ల ఆధిక్యం కలిగిన ప్రతినిధుల సభకి మాత్రం ఇంకా తాళం తీయడం లేదు.  

అమెరికాలో వైద్యులకి వందనం
అమెరికాలో ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది అహోరాత్రాలు నిర్విరామంగా పనిచేసినందుకు గాను ఎయిర్‌ ఫోర్స్,నేవీ సంయుక్తంగా విన్యాసాలు చేసి వారికి ధన్యవాదాలు తెలిపారు. బ్లూ ఏంజెల్స్, థండర్‌ బర్డ్స్‌కు చెందిన సుశిక్షితులైన పైలట్లు  వాషింగ్టన్, అట్లాంటా, బాల్టిమోర్‌ మీదుగా ప్రయాణిస్తూ విన్యాసాలు చేసి వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.  

రష్యాలో ఒకే రోజు 10వేలకు పైగా కేసులు
రష్యాలో ఆదివారం 10,633 తాజా కేసులు నమోదయ్యాయి. వీటిలో సగానికిపైగా కేసులు మాస్కోలో నమోదయ్యాయి. బ్రిటన్‌లో  కూడా మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.   

>
మరిన్ని వార్తలు