కరోనా సరే.. చైనాలో మరో పోరు

8 Mar, 2020 08:34 IST|Sakshi

జుట్టు ఆడవారికి అందాన్నిస్తుంది. వారిని ఆకర్షణీయంగా మారుస్తుంది. జుట్టుని తీయడమంటే ఒకరకంగా మహిళల్ని అవమానించడమే. కానీ ముంచుకొచ్చింది మామూలు ముప్పు కాదు. కరడుగట్టిన కరోనా. అందులోనూ పెద్ద జుట్టు ఉంటే వైరస్‌ ఎక్కడ వ్యాపిస్తుందోనని చైనాలో అధికారులు కరోనా వ్యాధిగ్రస్తులకి సేవచేసే మహిళా నర్సులకి జుట్టు కట్‌ చేస్తున్నారు. అంతేకాదు వారు నిరంతరం సేవలు అందించడం కోసం పీరియడ్స్‌ రాకుండా పిల్స్‌ ఇస్తున్నారు. ఇదంతా మహిళలపై చూపిస్తున్న వివక్షేనంటూ అంతర్జాతీయ మహిళాదినోత్సవ వేళ చైనా ఉమెన్‌ ఫెడరేషన్‌ పోరుబాట పట్టింది.

కరోనా వ్యాధిగ్రస్తులకు సేవ చేయడానికి ధరించే ఐసోలేషన్‌ సూట్‌ ధరించడమే ఇబ్బంది అనుకుంటే.. రేయింబవళ్లు పని చేయిస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్నవారి అవసరాలన్నీ అంచనా వేసిన చైనా ప్రభుత్వం అన్నీ అందించింది కానీ మహి ళలకి శానిటరీ ప్యాడ్స్‌ సరఫరా చేయలేకపోయింది. దీంతో నెలసరి వచ్చినప్పుడు మహిళా సిబ్బంది ఎన్నో పాట్లుపడ్డారు. దీనికి విరుగుడుగా నెలసరి వాయిదా వేయడానికి 200 బాటిల్స్‌ పిల్స్‌ అధికారులు సరఫరా చేశారు. సహజసిద్ధంగా వచ్చే పీరియడ్స్‌ని ఆపేస్తే హార్మోన్లపై ప్రభావం చూపిస్తుందంటూ మహిళా నర్సులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో స్వదేశీయంగా వాడే ట్విట్టర్‌ తరహా సామాజిక మాధ్యమమైన వైబోలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు వైరల్‌గా మారాయి. కరోనాపై పోరాటానికి సమాంతరంగా ఇప్పుడు మరో పోరాటం జరుగుతోంది. అవును మరి అక్కడ నర్సుల్ని కమాండ్‌ చేస్తున్న వారంతా మగవారే. వాళ్లకి ఆడవాళ్ల కష్టాలెలా అర్థమవుతాయి?.

>
మరిన్ని వార్తలు