‘గ్రాండ్‌ ప్రిన్సెస్‌’లో చిక్కుకుపోయిన 100 మంది భారతీయులు!

17 Mar, 2020 15:08 IST|Sakshi
గ్రాండ్‌ ప్రిన్సెస్‌ క్రూయిజ్‌ షిప్‌(ఫొటో: రాయిటర్స్‌)

వాషింగ్టన్‌: మహమ్మారి కోవిడ్‌-19(కరోనా వైరస్‌) ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్‌ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కరోనా వైరస్‌ కారణంగా 100 మంది భారతీయులు గ్రాండ్‌ ప్రిన్సెస్‌ క్రూయిజ్‌ షిప్‌లో చిక్కుకుపోయారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు... కొన్నిరోజుల క్రితం గ్రాండ్‌ ప్రిన్సెస్‌ 3500 మంది ప్రయాణీకులతో ఓక్లాండ్‌ తీరం నుంచి బయల్దేరింది. ఈ క్రమంలో అందులో ఉన్న 21 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో శాన్‌ ఫ్రాన్సిస్కో బే వద్ద నిలిపివేశారు. అనంతరం 2900(2400 మంది ప్రయాణీకులు, 500 మంది సిబ్బంది) మందిని శాన్‌ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువెళ్లి స్వస్థలాలకు తరలించారు. 

ఈ క్రమంలో తమ వద్ద కరోనా నెగటివ్‌ రిపోర్టులు లేవనే కారణంతో.. ఇండియన్‌ ఎంబసీ అధికారులు తమను షిప్పులోనే ఉండాల్సిందిగా సూచించారని దాదాపు 100 మంది ప్రయాణీకులు ఆరోపించారు. అదే విధంగా అమెరికా అధికారులు తమకు కరోనా టెస్టులు నిర్వహించేందుకు అంగీకరించడం లేదని పేర్కొన్నారు. తమకు ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కాపాడాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన భారత విదేశాంగ శాఖ... అమెరికాలో ఉన్న భారతీయుల ఆరోగ్యం, భద్రతకై భారత ఎంబసీ అధికారులు వాషింగ్టన్‌తో కలిసి పనిచేస్తున్నారని.. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కుంటామని పేర్కొంది. కాగా కరోనా ఆనవాళ్లు బయటపడిన తొలినాళ్లలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు జపాన్‌ తీరంలో డైమండ్‌ ప్రిన్సెస్‌ అనే నౌకను నిలిపివేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు