ముందుగానే స్పందిస్తే మరణాలు తగ్గించొచ్చు

30 Mar, 2020 05:18 IST|Sakshi
ఢిల్లీ–ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు వద్దకు చేరుకున్న వలస కార్మికుల చేతులపై శానిటైజర్‌ను చల్లుతున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సభ్యులు

1918 నాటి స్పానిష్‌ ఫ్లూ పరిస్థితులపై అధ్యయనంలో వెల్లడి 

నివారణ చర్యలు, ఐసోలేషన్‌ వంటి వాటితో ఫలితముంటుందన్న పరిశోధకులు

న్యూయార్క్‌: కరోనా వైరస్‌ వంటి అంటువ్యాధుల సమయంలో ముందుగానే నివారణ చర్యలు తీసుకోవడం వల్ల మరణాల సంఖ్య తగ్గేందుకు అవకాశం ఉందని అమెరికా పరిశోధకులు అంటున్నారు. 1918–19 సంవత్సరాల్లో స్పానిష్‌ ఫ్లూ మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో అమెరికాలోని కొన్ని నగరాల్లో ముందుగానే అప్రమత్తమై చేపట్టిన నిర్బంధ, నివారణ చర్యల కారణంగా మరణాలు తగ్గినట్లు లయోలా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా స్పానిష్‌ ఫ్లూ బారినపడి 5 కోట్ల మంది చనిపోగా అమెరికాలో 6.75 లక్షల మంది బలయ్యారు.

శాన్‌ఫ్రాన్సిస్కో, సెయింట్‌ లూయిస్, కన్సాస్‌ సిటీ, మిల్వాకీ నగరాలు చేపట్టిన.. పాఠశాలల మూసివేత, సభలు, సమావేశాలపై నిషేధం, కఠినమైన ఐసోలేషన్‌ విధానాలు, పరిశుభ్రత పాటించడం, తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చేయడం వంటి చర్యలు సత్ఫలితాలనిచ్చాయని పేర్కొన్నారు. ‘ఈ చర్యలు వ్యాధి తీవ్రతను 30 నుంచి 50 శాతం వరకు తగ్గించాయి. ఆలస్యంగా స్పందించిన/ ముందు జాగ్రత్తలు తక్కువగా తీసుకున్న నగరాలతో పోలిస్తే ఇవి మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఈ నగరాల్లో మరణాల రేటు గరిష్ట స్థాయిని చేరుకునేందుకు ఎక్కువ సమయం పట్టింది.

మొత్తం మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ పరిశోధన ఫలితాలు తాజాగా అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సైటోపాథాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ‘ఇలాంటి కఠినచర్యలతో ఎలాంటి ఫలితం ఉండదని అప్పట్లో జనం అనుకునేవారు. కానీ, అది తప్పు అని మా అధ్యయనంలో తేలింది’అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ‘1918లో  అమెరికాలో పేదరికం, పోషకాహార లోపం, అపరిశుభ్రత, జనం ఎక్కువగా గుమికూడటం ఎక్కువగా ఉండేవి.  అప్పటి పరిస్థితులతో పోల్చుకుంటే ప్రపంచం నేడు చాలా మారింది. అయినప్పటికీ, వందేళ్ల క్రితం తీసుకున్న నివారణ చర్యలు ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకూ అనుసరణీయాలే’అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.  

వయసుతో సంబంధం లేదు   
వాషింగ్టన్‌:   కరోనా ముప్పు వృద్ధులకే అధికమన్న వాదనలో నిజం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఆరోగ్యం.. అనారోగ్యం అన్నవే కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు కరోనా బారినపడే అవకాశాలు తక్కువని తేల్చిచెప్పింది. సహజంగా వృద్ధుల్లో అరోగ్యవంతులు అంతంతమాత్రమే కాబట్టి అలాంటి వారే బలయ్యే ప్రమాదం ఉందంది.

మరిన్ని వార్తలు