న్యూయార్క్‌ ఆవల వైరస్‌ విజృంభణ

7 May, 2020 03:05 IST|Sakshi
వుహాన్‌లోని ఓ హైస్కూల్‌లో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతీ టేబుల్‌పై ప్లాస్టిక్‌షీట్‌ను ఏర్పాటుచేసిన దృశ్యం

న్యూయార్క్‌: అమెరికాలోని పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఎత్తివేసిన నేపథ్యంలో కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 20 వేల కొత్త కేసులు నమోదు కాగా.. వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయినట్లు జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో పెరుగుతున్న ఇన్ఫెక్షన్‌ రేటును అదుపు చేయకుంటే మరిన్ని మరణాలు తప్పవని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సారి మరణాలు వేల సంఖ్యలో ఉంటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: అసలు సవాలు ఇప్పుడే!

అమెరికాలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటే కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ న్యూయార్క్‌ దాని పరిసర ప్రాంతాలను మినహాయించి చూస్తే ఐదు రోజుల్లో నమోదైన కేసుల సగటు ప్రతి లక్ష మందికి 6.2 నుంచి 7.5కు పెరిగినట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ జరిపిన ఒక అధ్యయనం చెబుతోంది. న్యూయార్క్‌లో కొన్ని రోజులుగా కోవిడ్‌ మరణాలు తగ్గుముఖం పట్టాయి కానీ చాలా ప్రాంతాల్లో పెరిగాయి. పరీక్షలు ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్న వాదన అమెరికా విషయంలో పనిచేయదని, వాస్తవంగా కేసులు ఎక్కువయ్యాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్త జువో ఫెంగ్‌ జాంగ్‌ తెలిపారు.

న్యూయార్క్‌కు దూరంగా ఉన్న ప్రాంతాల్లోనూ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. అయోవాలో మంగళవారం రికార్డు స్థాయిలో 19 మంది ప్రాణాలు కోల్పోగా టైసన్‌ ఫుడ్‌ పోర్క్‌ ప్లాంట్‌లో దాదాపు 730 మందికి వైరస్‌ సోకింది. కాన్సస్‌లోని షానీ కౌంటీలో వారం రోజులుగా కేసుల సంఖ్య రెట్టింపు అవుతోందని ఒక నివేదికలో వెల్లడైంది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన రోజు నుంచే కేసుల పెరుగుదల నమోదు కావడం ఇక్కడ గమనార్హం. భౌతిక దూరం పాటించడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఆగస్టు నాటికి అమెరికా మొత్తమ్మీద కోవిడ్‌ కారణంగా 1.34 లక్షల మంది మరణించే అవకాశముందని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త క్రిస్టఫర్‌ ముర్రే సిద్ధం చేసిన మోడల్‌ హెచ్చరించడం తెల్సిందే.  చదవండి: ‘ఇన్‌స్టా’లో ‘బాయిస్‌’ బీభత్సం 

పోరులో మలిదశలో ఉన్నాం
వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ కేసుల గ్రాఫ్‌ను ఇప్పటికే చదును చేసిన అమెరికా.. మలిదశలో సురక్షితంగా.. దశలవారీగా లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించే ప్రక్రియలో ఉందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. పౌరుల చిత్తశుద్ధి కారణంగా వైరస్‌ గ్రాఫ్‌ను చదును చేయగలిగామని, తద్వారా లెక్కలేనని అమెరికన్‌ పౌరుల ప్రాణాలు కాపాడుకోగలిగామని ఆయన ఫీనిక్స్‌లో మాస్క్‌లు తయారు చేసే ఫ్యాక్టరీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు.
వారం రోజులుగా దేశం మొత్తమ్మీద కేసులు, మరణాల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఈ అంశం ఆధారంగానే ట్రంప్‌ గ్రాఫ్‌ వంపును చదునుచేసి చెబుతున్నట్లు అంచనా. ఈ మహమ్మారి కారణంగా అమెరికా వస్తు సేవల సరఫరా అవసరాన్ని మరోసారి నొక్కి చెప్పిందని, స్థానికంగా వస్తువుల తయారీ కేంద్రాల నిర్మాణం జరగాలని చెబుతోందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అంతకు ముందు ట్రంప్‌ ఒక రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతూ కరోనా ఓ గట్టి ప్రత్యర్థేనని కానీ.. దానిపై విజయం సాధిస్తున్నామని భరోసానిచ్చారు. అమెరికా ఇప్పుడు వెంటిలేటర్లు వంటి అత్యవసర సరుకులను అందివ్వడం ద్వారా నైజీరియా వంటి దేశాలను ఆదుకునేపనిలో ఉందని అన్నారు.  

మరిన్ని వార్తలు